
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ (Scheduled Flights)పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు అంతర్జాతీయ విమానాల (International Flights)పై నిషేధం (Ban) అమల్లోనే ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసింది. అయితే, ఈ నిషేధం కార్గో విమానాలకు, ప్రత్యేకంగా అనుమతులు పొందిన ఫ్లైట్స్‌కు వర్తించవని వివరించింది.
అలాగే, ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని కలిగి ఉన్న దేశాలతో భారత్ నుంచి విమాన సేవలు కొనసాగుతాయని వివరించింది. కరోనా ఉధృతి కొంత తగ్గుతున్న సమయంలో కొన్ని దేశాలు పరస్పరం ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం కింద పరస్పర దేశాల మధ్య విమానాలు వస్తూ పోతున్నాయి. 2020 జులై నుంచి ఈ ఒప్పందం కింద భారత్ నుంచి పలు దేశాలకు విమాన రాకపోకలు జరుగుతున్నాయి. భారత్ నుంచి సుమారు 40 దేశాల మధ్య ప్రత్యేక విమానాలు ఈ ఒప్పందం కింద సేవలు అందిస్తున్నాయి. వీటికి తోడు వందే భారత్ మిషన్ కింద నడిచే విమానాలకూ ఈ నిషేధం వర్తించదని డీజీసీఏ పేర్కొంది.
చివరిసారిగా డీజీసీఏ అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. 2020 మార్చి 23వ తేదీ నుంచి ఈ నిషేధం కొనసాగుతూనే ఉన్నది. సెకండ్ వేవ్ ముగిశాక.. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఎత్తివేస్తామని నవంబర్ 26న కేంద్రం తెలిపింది. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఒక్కసారిగా విజృంభించడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరగ్గానే నిషేధం ఎత్తేయాలన్న నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖను పీఎం మోడీ ఆదేశించారు. దీంతో నవంబర్ 26 ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు డిసెంబర్ 1వ తేదీన డీజీసీఏ వెల్లడించింది.
అయితే, ఈ సారి విమానాలపై నిషేధాన్ని కొనసాగిస్తూ ఎంత కాలం అన్న విషయాన్ని డీజీసీఏ పేర్కొనలేదు. కొన్నాళ్లుగా ఒక సారి నిషేధాన్ని నెల చొప్పున పొడిగిస్తున్నారు. కానీ, ఈ సారి మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొనడం గమనార్హం.
23 నెలల నిషేధం తర్వాత అంతర్జాతీయ విమాన సేవలు మళ్లీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో అందుబాటులోకి రావొచ్చని ఇదే నెలలో విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఈ మేరకు కేంద్ర వైమానిక శాఖ కేంద్ర ఆరోగ్య, హోం శాఖలతో చర్చలు జరుపుతున్నట్టు వివరించాయి. ఈ చర్చల్లోనే అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరించాలా? లేక నిషేధాన్ని ఎప్పటిలాగే కొనసాగించాలా? అనే నిర్ణయాన్ని తీసుకోబుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సేవలపై ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిషేధం అమలులో ఉన్నది. అయితే, వందే భారత్ మిషన్ కింద కొన్ని విమానాలు సేవలు అందిస్తున్నాయి. ఇతర దేశాలతో మన దేశం ఏర్పాటు చేసుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగానూ విమాన సేవలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం కింద ఆ ఉభయ దేశాల మధ్య విమాన ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నాయి.