
జైపూర్: క్రైమ్ షోల ప్రేరణతో ఓ మహిళ తన మరదలిని హత్య చేసింది. రాజస్థాన్ లోని కాలడేరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గొంతు నులిమి చంపిన 35 ఏళ్ల మహిళ శవాన్ని కుర్చీలో ఉంచి, కరెంట్ షాక్ ఇచ్చింది.
జూన్ 16, 17 మధ్య రాత్రి తన ఇంట్లో సునీత జాత్ (29)ని హత్య చేసినట్లు మంజు పోలీసు విచారణలో అంగీకరించింది. శవాన్ని కుర్చీ మీదికి లాగి, కేబుల్ వైరుతో విద్యుత్ షాక్ ఇచ్చింది. విద్యుత్ షాక్ వల్ల మరణించిందని పోస్టుమార్టంలో తేలుతుందని భావించి అలా చేసింది.
పోటీ పరీక్షల కోసం సునీత సిద్ధమవుతుండడంతో ఇంటి పనులన్నీ మంజు చేయాల్సి వస్తోంది. దీంతో ఆమెపై మంజు కోపం పెంచుకుంది. టెలివిజన్ క్రైమ్ షోలు చూసి సునీత హత్యకు పథక రచన చేసింది.
సునీత మెడపై గాట్లు, గాయాలు చూసిన పోలీసులు మంజు మెడపై గాయాలు, గాట్లు కనిపించాయి. దాని వల్ల ఇరువురి మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించారు. గొంతు నులుముతుండగా సునీత పెనుగులాడడంతో మంజు మెడపై గాయాలయ్యాయి. చేతి గోళ్లను పరీక్షించిన పోలీసులు మంజుని నిందితురాలిగా గుర్తించారు. మంజును పోలీసులు అరెస్టు చేశారు.