కాసేపట్లో తీరం దాటనున్న బిపర్ జాయ్ : సర్వసన్నద్ధంగా యంత్రాంగం, మద్ధతుగా త్రివిధ దళాలు.. తీరంలో భయం భయం

Siva Kodati |  
Published : Jun 15, 2023, 07:55 PM IST
కాసేపట్లో తీరం దాటనున్న బిపర్ జాయ్ : సర్వసన్నద్ధంగా యంత్రాంగం, మద్ధతుగా త్రివిధ దళాలు.. తీరంలో భయం భయం

సారాంశం

గడిచిన రెండ్రోజులుగా అరేబియా తీరాన్ని అల్లకల్లోలంగా మార్చిన బిపర్‌ జాయ్ తుఫాన్ మరికాసేపట్లో తీరాన్ని దాటనుంది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ అధికార యంత్రాంగం విపత్తను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. తుఫాను నేపథ్యంలో తీరంలో భయానక వాతావరణం నెలకొంది. 

జూన్ 15 (గురువారం) రాత్రి బిపర్ జాయ్ తుఫాను సౌరాష్ట్, కచ్ , మాండ్వి , కరాచీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బిపార్జోయ్ తుఫాను ప్రస్తుతం అరేబియా సముద్రంలో జాఖౌ నౌకాశ్రయానికి 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను వెంటే గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు వస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ తీర జిల్లాల నుంచి లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను దాటికి గుజరాత్, మహారాష్ట్రలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ముఖ్యంగా అరేబియా తీరం అల్లకల్లోలంగా వుండటంతో సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుఫాను తీరం దాటే సమయంలో బీకరమైన ఈదురుగాలులు వీస్తాయని.. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడతాయని ఐఎండీ హెచ్చరించింది. ఐఎండీ డైరెక్టర్ రాధే శ్యామ్ శర్మ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. బీపర్ జోయ్ తీవ్రమైన తుఫాను కేటగిరీలో వుందన్నారు. బుధవారం దాని కదలిక ఈశాన్య దిశలో వుండగా.. జూన్ 15న సౌరాష్ట్ర, కచ్ , గుజరాత్ తీరాలను తాకుతుందన్నారు. జూన్ 16న కాస్త బలహీనపడి రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుందని శర్మ తెలిపారు. 

బిపర్‌జాయ్ తుఫాన్‌ను కేటగిరీలో 3లోని అత్యంత తీవ్ర తుఫాన్‌గా విభజించింది. ఈ తుఫాన్ గంటలకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను వెంట తీసుకురానుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచే గాలుల వేగం పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే అధికార యంత్రాంగం కచ్ జిల్లాలో తీరం నుంచి పది కిలో మీటర్ల వైశాల్యంలోని 120 గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ప్రభావంతో గుజరాత్ కోస్తాలోని మోర్బి, ద్వారక, జామ్ నగర్ తదితర జిల్లాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 

గుజరాత్ సీఎం భుపేంద్ర పటేల్ ఈ రోజు గాంధీనగర్‌లోని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు తీర జిల్లాలు కచ్, జామ్ నగర్, మోర్బి, రాజ్ కోట్, దేవభూమి ద్వారకా, జునాగడ్, పోర్బందర్, గిర్ సోమనాథ్‌ల నుంచి సుమారు ఒక లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని తాత్కాలిక ఆశ్రయాల్లోకి తరలించారు. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కోవడానికి 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాల 12 బృందాలు, రాష్ట్ర రోడ్డు, భవంతుల శాఖకు చెందిన 115 బృందాలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 397 బృందాలు తీర జిల్లాల్లో మోహరించి ఉన్నాయి.

గుజరాత్ ప్రజల కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సహా ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచామని, వారికి సహకరించడానికి సన్నద్ధం చేసి ఉంచామని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.  రేపటి వరకు అంటే జూన్ 16వ తేదీ వరకు చేపల వేటను రద్దు చేశారు. పోర్టులు మూసేశారు. పడవలను ఒడ్డుకు కట్టారు. తుఫాన్ వస్తున్నందున సముద్రంలో అలలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. పశ్చిమ రైల్వే తుఫాన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 76 రైళ్లను రద్దు చేసింది. దేవ భూమి ద్వారకా జిల్లాలోని ద్వారకాదీశ్ టెంపులు, గిర్ సోమనాథ్ జిల్లాలోని గిర్ సోమనాథ్ ఆలయాన్ని గురువారం మూసేయనున్నారు. 

బిపర్‌జాయ్ తఫాన్ సన్నద్ధతపై పశ్చిమ నౌకాదళ కమాండ్ ఓపీఎస్ చీఫ్ స్టాఫ్ ఆఫీయర్ రియర్ అడ్మిరల్ కునాల్ రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోందన్నారు. గంటలకు సుమారు 130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించిందని రాజ్ కుమార్ అన్నారు. సహాయక చర్యల కోసం నౌకాదళం 25కి పైగా ప్రత్యేక బృందాలతో సిద్ధంగా వుందని ఆయన తెలిపారు. వీరిలో వైద్య నిపుణులు, ఈతగాళ్లు, పోర్టబుల్ చైన్ సెట్‌లు, శిధిలాల తొలగింపు సామాగ్రి అందుబాటులో వుంచామన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?