ఉలిక్కిపడ్డ ముంబై ఎయిర్‌పోర్ట్.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

By Rajesh KarampooriFirst Published Oct 2, 2022, 10:48 PM IST
Highlights

ముంబైలోని ఇండిగో విమానంలో బాంబు పెట్టిన‌ట్టు ముంబై విమానాశ్రయంలోని అధికారులకు శనివారం ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో ఒక్క‌సారిగా ముంబై విమానాశ్రయం ఉలిక్కిపడింది.

బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వ‌చ్చాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ విషయమై బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి ఈ మెయిల్ వచ్చిందని ముంబై పోలీసు అధికారులు ఆదివారం సమాచారం అందించారు. ఆ సమయంలో విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. 

వివరాల్లోకెళ్తే..  ఇండిగోకు చెందిన 6E 6045 నంబర్‌ విమానం శనివారం రాత్రి ముంబై నుంచి అహ్మదాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈ మెయిల్‌ వచ్చింది. ఈ మెయిల్ లో ఇండిగో విమానాన్ని పేల్చివేసేందుకు బాంబులు పెట్టిన‌ట్టు రాసి ఉంది. దీంతో ఒక్క‌సారిగా విమానాశ్ర‌మంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. 

అయితే, విచారణ అనంతరం విమానంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో ఇది పుకారు అని తేలింది. ఘ‌ట‌న‌పై   భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506బి కింద గుర్తు తెలియ‌ని వ్య‌క్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఈ ఘటనపై ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. బాంబు బెదిరింపు కారణంగా 2022 అక్టోబర్ 1న ఇండిగో విమానం ప్రభావితమైందని ప్రకటన పేర్కొంది. 

ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇందుకోసం ఎంఐఏఎల్ జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ. ఇండిగో.. చౌక ధ‌ర‌ల్లో విమానయ‌నం చేయ‌డానికి వీలు క‌ల్పిస్తున్న సంస్థ‌.. 

click me!