
న్యూఢిల్లీ : మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ఒక ప్రయాణీకుడు విమానం ల్యాండింగ్ సమయంలో మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రయాణికుడు నైజీరియా దేశస్థుడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
"ఈ వార్త మమ్మల్ని చాలా బాధపెట్టింది. అతని కుటుంబానికి, సన్నిహితులకు మా సానుభూతి. మా సహాయం ఎప్పటికీ వారికి ఉంటుంది. ప్రస్తుతం సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం" అని ఇండిగో తెలిపింది. ఈ విమానం త్వరలో కరాచీ నుంచి బయలుదేరుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇండిగో విమానంలో గతవారం కూడా ఇలాంటి విషాద ఘటనే చోటుచేసుకుంది. మార్చి 7వ తేదీన జెడ్డా నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఇది గమనించిన విమాన సిబ్బంది జోధ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానా్ని ల్యాండ్ చేశారు. ఆ ప్రయాణికురాలిని జోధ్‌పూర్‌లోని గోయల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ.. అక్కడికి వెళ్లేసరికే.. వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
హర్యానాలో విషాదం.. రిషికేశ్‌లోని గంగానదిలో రాఫ్టింగ్ చేస్తూ టూరిస్ట్ మృతి..
ఆ ప్రయాణికురాలిని మిత్రా బానో(61) అని, జమ్మూ కాశ్మీర్‌లోని హజారీబాగ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె, తన కొడుకుతో కలిసి విమానంలో ప్రయాణిస్తోంది. విమానంలో హఠాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో విమానంలో ఉన్న ఒక వైద్యుడు ప్రయాణీకుడికి తక్షణం.. ప్రథమ చికిత్స అందించారు. అతనికి సిబ్బందికి సహాయం చేశారని ఇండిగో తెలిపింది. కానీ, దురదృష్టవశాత్తు, ఇంత చేసినా ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ ప్రయాణికురాలు మరణించింది.
విమానయాన సంస్థలు మిత్రా బానో కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేసాయి. జోధ్‌పూర్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడు బానో కుమారుడు మీర్ ముజఫర్ ఆమెతోనే ఉన్నాడు. "మా అమ్మ తన ఛాతీలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసింది. నేను కంగారు పడ్డాను.. నేను వెంటనే సిబ్బందికి సమాచారం అందించాను. వారూ వెంటనే అలెర్ట్ అయి జోధ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయించారు " అని అతను చెప్పాడు.
ఆసుపత్రి వర్గాల ప్రకారం.."మహిళకు తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడం వల్ల చనిపోయింది. ఆమె మృతదేహాన్ని రోడ్డు మార్గంలో ఇంటికి తీసుకెళ్లేందుకు.. చట్టబద్ధమైన అన్ని లాంఛనాలు పూర్తిచేసి.. ఆమె కొడుకుతో పాటు తీసుకువెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశాం" అని తెలిపారు. ఈ ఘటన వల్ల విమానం గంటకు పైగా ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిందని.. ఆ తరువాత ఢిల్లీకి బయలుదేరిందని అధికారులు తెలిపారు.