విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు.. ఇండియాలో క్వాలిఫై కావట్లేదు: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Published : Mar 02, 2022, 02:29 PM IST
విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు.. ఇండియాలో క్వాలిఫై కావట్లేదు: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

విదేశాలలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు మన దేశంలో ఎఫ్ఎంజీఈ పరీక్షలో 90 శాతం మంది ఉత్తీర్ణులు కావడం లేదని వివరించారు. విదేశాల్లో మెడిసిన్ చదవడానికి దేశం వదిలిపోవాల్సిన అవసరం ఏముందన్న అంశంపై చర్చించడం ఇప్పుడు సబబు కాదని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదవడానికి అక్కడికి వెళ్లినవారే కావడం గమనార్హం.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయాస పడుతున్నది. అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఆపరేషన్ గంగ పేరిట ఉక్రెయిన్ నుంచి భారతీయులను పొరుగు దేశాలకు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నది. ఇప్పుడంతా రష్యా దాడి గురించి.. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు గురించే చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదవడానికి ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

విదేశాల్లో మెడిసిన్ చదువే భారతీయ విద్యార్థుల్లో 90 శాతం మంది మన దేశంలో నిర్వహించే క్వాలిఫై పరీక్షలో ఫెయిల్ అవుతున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వివరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ.. మెడిసిన్ చదవడానికి విదేశాలకు ఎందుకు భారతీయ విద్యార్థులు వెళ్తున్నారన్న అంశంపై చర్చించడం ఇప్పుడు సరైన సమయం కాదని అన్నారు. అదే సమయంలో ఆయన విదేశాల్లో మెడిసిన్ చదివుతున్న విద్యార్థులు మన దేశంలో నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అవుతున్నారని పేర్కొన్నారు. విదేశాల్లో మెడికల్ డిగ్రీ పొందిన భారతీయులు మన దేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే.. ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది.

ఇప్పటికీ ఉక్రెయిన్‌లో వేలాది మంది భారతీయులు చిక్కుకున్న తరుణంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. స్వదేశానికి తరలించడానికి తమకు సహకరించాలని వారు అభ్యర్థనలు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో ట్రైన్ ఎక్కినా.. దాడి చేస్తున్నారని, బలవంతంగా ట్రైన్ నుంచి దింపేస్తున్నారని వారు ఆరోపించారు. నడుచుకుంటూ ఇతర దేశాల సరిహద్దులకు వెళ్లినప్పుడూ జీరో డిగ్రీ ఉష్ణోగ్రతల్లోనూ గంటల కొద్దీ ఆహారం, నీరు లేక పడిగాపులు కాయాల్సి వస్తున్నదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నిన్న ఖార్కివ్‌లో కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి షెల్లింగ్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, మన దేశ అవసరాలకు సరిపడా మెడికల్ సీట్లు ఇక్కడ లేవని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. అలాగే, ఇక్కడ వైద్యులకు, పేషెంట్లకు మధ్య ఉన్న నిష్పత్తి కూడా దారుణంగా ఉన్నదని పేర్కొన్నారు. అసలు విదేశాల్లో చదువుకున్న మెడికల్ గ్రాడ్యుయేట్లు లేకుంటే.. ఇక్కడి పరిస్థితులు మరింత దారుణంగా ఉండేవని తెలిపారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (russia ukraine crisis) నేపథ్యంలో విద్యార్ధుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను భారతీయులు వెంటనే విడిచివెళ్లాలని భారత ఎంబసీ ఆదేశించింది. విద్యార్థులతో పాటు భారతీయులందరూ ఈ రోజే అత్యవసరం కీవ్ నగరాన్ని వదిలివెళ్లాలని భారత ఎంబసీ మంగళవారం ట్విట్టర్‌లో సూచించింది. అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా బయటపడాలని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్