
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)లో క్షణక్షణం లెక్కపెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి బాంబులు వచ్చి పడతాయో తెలీదు. తెల్లారేలోగా ఎవరు బతుకుతారో.. ఎంత మంది మరణిస్తారో కూడా తెలియని ఉద్రిక్త పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఉంది. అందుకే పౌరులు, ఆ దేశానికి వలస వచ్చినవారు.. చదువుకోవడానికి వచ్చిన విదేశీయులూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశంలోని పశ్చిమం వైపు పరుగులు పెడుతున్నారు. పొరుగు దేశాల సరిహద్దులకు శరణార్థులుగా వెళ్తున్నారు. కానీ, ఉక్రెయిన్‌లోనే ఉన్న ఓ భారతీయుడు ఈ సంక్షోభ సమయంలోనూ దాతృత్వాన్ని చాటుతున్నాడు. తోచిన సహాయం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ ఓ భారతీయుడు(Indian) తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.
బాంబులు పడినా సరే.. తన రెస్టారెంట్(Indian Restaurant) మూసే ఉంచుతానని, అవసరార్థులకు ఆహారం, ఆశ్రయం ఇస్తానని మనీష్ దవే పేర్కొన్నాడు. తనకు వీలైనంత మేరకు సహాయం చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ పదుల సంఖ్యలో పిల్లలు, గర్భిణులు, విద్యార్థులు, నిరాశ్రయులు, స్థానిక వృద్ధులను తన రెస్టారెంట్‌లో తలదాచుకోవడానికి అనుమతించాడు. వారికి ఉచితంగా ఆహారం కూడా అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 132 మందికి ఆహారం, ఆశ్రయం కల్పించాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మనీష్ దవేకు చెందిన సాతియా రెస్టారెంట్ ఉన్నది.
ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థుల కోసం ఈ గుజరాతి మనీష్ దవే అక్కడ సాతియా రెస్టారెంట్‌ను జనవరిలో ప్రారంభించాడు. రెస్టారెంట్ పెట్టాలనే ఆయన గతేడాది ఉక్రెయిన్ వెళ్లాడు. జనవరిలో రెస్టారెంట్ ప్రారంభించాడు. బొగోమెలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉండే ఇంటర్నేషనల్ స్టూడెంట్ల హాస్టల్ సమీపంలోనే తన రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. అంతా సాఫీగానే సాగిపోతున్నది. కానీ, ఇంతలో రష్యా ఈ దేశంపై యుద్ధాన్ని ప్రకటించిందని రెస్టారెంట్ ఓనర్ మనీష్ దవే పేర్కొన్నాడు. ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారని, ఇది చూసి తాను ఆవేదన చెందారని, కాబట్టి, తన రెస్టారెంట్‌లోని బేస్‌మెంట్ సేఫ్ ప్లేస్ అని భావించి ఇతరులకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నాడు.
ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పేర్కొన్నాడు. ఎవరికైనా ఆహారం, ఆశ్రయం కావాల్సి ఉంటే తమ సామర్థ్యంలో అందిస్తామని వివరించాడు. తన రెస్టారెంట్ అడ్రెస్ కూడా అందులో పేర్కొన్నాడు. వారు ఎవరు? ఏ జాతీయుడు? అనే విషయాలను పట్టించుకోమని, ఆశ్రయం, ఆహారం ఇస్తామని వివరించాడు. తమ సంస్కృతిని వ్యాపించడానికే తాను ఇక్కడ రెస్టారెంట్ పెట్టినట్టు చెప్పాడు. ఆ రెస్టారెంట్‌లో ఆశ్రయం పొందిన ఉక్రెయిన్ పౌరురాలు నటాలీ అంటోంట్సెవా.. సాతియా రెస్టారెంట్ గురించి మాట్లాడాతూ, అక్కడ తమకు మనసు మెచ్చిన స్వాగతం లభించిందని, కటిక నేలపై పడుకోవడం కంటే వారిచ్చిన బెడ్ బాగుందని, తమకు వేడి వేడి టీ, డిన్నర్ అందించారని పేర్కొన్నారు. డబ్బులు తీసుకోలేదని, కానీ, ఇతరులకు అవసరం పడుతుంది కాబట్టి.. డబ్బుకు బదులు ఆహార సరుకులు అందించాలని కోరాడని తెలిపారు. ఈ ఏరియాలోనూ షెల్లింగ్ దాడులు జరిగి.. తమ ఉనికి ప్రమాదంలో పడితే.. ఆ ఆఖరి క్షణంలో తాను అక్కడి నుంచి స్వదేశానికి వచ్చేస్తానని దవే చెప్పాడు. అయితే, అప్పుడు రెస్టారెంట్ తాళాలు అక్కడే ఆశ్రయం పొందుతున్నవారికి అప్పజెప్పి వస్తానని వివరించాడు.