
రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం (annual summit) వల్ల భారత్ - ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) అన్నారు. సోమవారం అస్ట్రేలియా-భారత్ కు మధ్య వర్చువల్ సమ్మిట్ (virtual summit) జరిగింది. ఇందులో ఇరు దేశాల ప్రధానులు పాల్గొన్నారు. ముందుగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ (Australian Prime Minister Scott Morrison)కు ప్రధాని మోడీ ‘‘నమస్కార్ ’’అంటూ అభివందనం చేశారు. క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్‌లో సంభవించిన వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లడం పట్ల ప్రధాని మోడీ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ వర్చువల్ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాకు అక్రమంగా తరలిన 29 భారతీయ కళాఖండాలను భారత్ కు తిరిగి ఇచ్చినందుకు ఆస్ట్రేలియా అధినేతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ భారతీయ పురాతన వస్తువులను తిరిగి ఇవ్వడానికి చొరవ చూపినందుకు ధన్యవాదాలు. మీరు పంపిన పురాతన వస్తువులలో రాజస్థాన్ (Rajasthan), వెస్ట్ బెంగాల్ (West Bengal), గుజరాత్ (Gujarat), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకెళ్లిన వందల సంవత్సరాల నాటి కళాఖండాలు, ఇతర ఫొటోలు ఉన్నాయి. వాటిని తిరిగి ఇచ్చినందుకు భారతీయులందరి తరపున, నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ’’ అని ప్రధాని మోడీ చెప్పారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “ మన గత వర్చువల్ సమ్మిట్‌లో మేము మన సంబంధానికి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య రూపాన్ని ఇచ్చాం. ఈ రోజు మనం రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.’’ అని అన్నారు.
“ఇది మన సంబంధాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి ఒక నిర్మాణాత్మక వ్యవస్థను సిద్ధం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలలో మన సంబంధాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విద్య, ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ ఈ అన్ని రంగాల్లో మన మధ్య చాలా సన్నిహిత సహకారం ఉంది. ” అని ఆయన చెప్పారు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war) సందర్భంలో ప్రాంతీయ సహకార ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. ‘‘ మన ప్రాంతం ఈ మార్పు వల్ల చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మన క్వాడ్ నాయకులు ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా చట్టవిరుద్ధమైన దాడి విషయంలో చర్చించడానికి మాకు అవకాశం ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఇది ఇండో-పసిఫిక్‌లోని మన సొంత ప్రాంతానికి ఆ భయంకరమైన ఘటన వల్ల కలిగే చిక్కులు, పరిణామాలు, మేము అక్కడ ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో చర్చించడానికి మాకు అవకాశం ఇచ్చింది ’’ అని మోరిసన్ తెలిపారు.