
భారత సైనికులు ఎంతో ప్రతిభా వంతులు అనే సంగతి తెలిసిందే. దేశ భద్రత కోసం శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికే కాకుండా.. ప్రకృత్తి విపత్తుల సమయంలో ప్రజలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడంలోనూ ముందుంటారు. తాజాగా సిక్కింలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, రోడ్లు బ్లాక్‌లు ఏర్పడటంతో ఉత్తర ప్రాంతంలో చిక్కుకున్న 500 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది. ఇందులో 54 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ మేరకు రక్షణ శాఖ అధికారి ఒకరు శనివారం వివరాలు వెల్లడించారు.
లాచెన్, లాచుంగ్, చుంగ్తాంగ్‌లలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా లాచుంగ్ నుంచి లాచెన్ లోయకు ప్రయాణిస్తున్న సుమారు 500 మంది పర్యాటకులు మార్గమధ్యంలో కొండచరియలు విరిగిపడటం, రోడ్ బ్లాక్‌ల కారణంగా చుంగ్తాంగ్ వద్ద చిక్కుకుపోయారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు సమాచారం అందించినట్టుగా తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం.. వారిని రక్షించింది.
‘‘చుంగ్తాంగ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభ్యర్థన మేరకు త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీ దళాలు రంగంలోకి దిగాయి. చిక్కుకుపోయిన పర్యాటకులను సురక్షితంగా రక్షించాయి. పర్యాటకులలో 216 మంది పురుషులు, 113 మంది మహిళలు మరియు 54 మంది పిల్లలు ఉన్నారు. వారిని మూడు వేర్వేరు సైనిక శిబిరాలకు తరలించారు. వారికి వేడి భోజనం, వెచ్చని దుస్తులు అందించబడ్డాయి’’ అని రక్షణశాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
‘‘దళాల సత్వర చర్య వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించబడింది. వీలైనంత త్వరగా వాహనాల రాకపోకలకు రోడ్లను క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్యాటకులు తదుపరి ప్రయాణానికి మార్గం క్లియర్ అయ్యే వరకు వారికి అన్ని సహాయాలు అందించబడతాయి’’ అని కూడా చెప్పారు. పర్యాటకులకు వసతి కల్పించడానికి, రాత్రికి సౌకర్యంగా ఉండటానికి దళాలు తమ బ్యారక్‌లను ఖాళీ చేశాయని తెలిపారు. ప్రర్యాటకులందరీ ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేయడానికి మూడు వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సైన్యానికి చెందిన వైద్య బృందాలచే నిర్వహించిన ప్రాథమిక వైద్య తనిఖీలలో అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని గుర్తించామని చెప్పారు.
అయితే గురుడోంగ్మార్ సరస్సును సందర్శించిన ఒక మహిళ తీవ్రమైన తలనొప్పి, మైకంగా ఉన్నట్టుగా ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయితే ఆమెకు వెంటనే వైద్యం అందించబడిందని.. ఆమెను మెడికల్ హాస్పిటల్‌లోని ఐసీయూకి తరలించారని చెప్పారు. ఈ ఉదయం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వెల్లడించారు.
ఇక, రక్షించబడిన పర్యాటకులు సైనికుల కృషికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారత సైన్యం మాకు సహాయం చేసింది. ఆశ్రయం ఇచ్చింది. వారు మాకు డిన్నర్, అల్పాహారం, పడుకోవడానికి స్థలం ఇచ్చారు.. మేము భారత సైన్యానికి ధన్యవాదాలు చెబుతున్నాం’’ అని పర్యాటకులలో ఒకరు పేర్కొన్నారు. ‘‘భారతీయ సేనా కీ జై(జై ఇండియన్ ఆర్మీ) ’’ అంటూ నినాదాలు చేశారు.