
రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిగ్ 21 విమానాల వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విమానాలను వాడరాదని నిర్ణయించింది. భారత వాయుసేనలో ప్రస్తుతం 50 మిగ్ 21 విమానాలు వున్నాయి. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సాధారణ శిక్షణలో భాగంగా వెళ్తున్న మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోవడం కలకలం రేపింది. అదృష్టవశాత్తూ పైలట్ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా.. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడానికి అధికారిక విచారణకు ఎయిర్‌ఫోర్స్ ఆదేశించింది. ప్రమాదం జరిగిన రోజున సూరత్‌గఢ్ నుంచి మిగ్ 21 బయల్దేరింది. ఈ ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలిసే వరకు మిగ్ 21 విమానాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ఫోర్స్ తెలిపింది.
1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధంతో పాటు బాలాకోట్ సర్జికల్స్ స్ట్రైక్స్ వంటి ఆపరేషన్‌లలో మిగ్ 21 ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి. సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన ఈ మిగ్ 21 విమానాలు భారత వాయుసేనలో దాదాపు 60 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. అయితే వరుస విషాదాలు, విలువైన సైనికుల ప్రాణాలు పోతున్న నేపథ్యంలో మిగ్ 21 విమానాలను గ్రౌండింగ్ చేయాలని భారత వాయుసేన నిర్ణయించింది.
1960లలో భారత వైమానిక దళంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఎన్నో ప్రమాదాలకు గురైన నేపథ్యంలో మిగ్ 21 విమానాలను ‘‘ఎగిరే శవపేటిక’’లుగా అభివర్ణిస్తారు. గడిచిన 60 ఏళ్లలో 400కి పైగా మిగ్ 21 క్రాష్‌లు జరగ్గా.. 200 మందికిపైగా పైలట్లు, 60 మందికి పైగా సాధారణ పౌరులు ఆయా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధ విమానాలను రష్యా 1985లోనే పక్కనబెట్టగా.. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లు కూడా వీటి సేవలను నిలిపివేశాయి. కానీ భారత్ మాత్రం ఇంకా కొనసాగించడంపై రక్షణ రంగ నిపుణులు పలుమార్లు హెచ్చరించారు.