
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చైనాతో భారత సరిహద్దులో ఇండియన్ ఆర్మీ చూపించిన శౌర్యాన్ని వివరించారు. ‘భారత జవాన్లు ఏమేం చేశారో, భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదో నేను బహిరంగంగా చెప్పలేను. కానీ, వారికి (చైనాకు) మాత్రం కచ్చితంగా సందేశమైతే వెళ్లింది. భారత్‌ను ఎవరు రెచ్చగొట్టినా వదిలిపెట్టదనే స్ట్రాంగ్ మెస్సేజ్ వారికి
వెళ్లిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను’ అని వివరించారు.
లడాఖ్ సరిహద్దులో భారత్, చైనా ఆర్మీల మధ్య 2020 జూన్ నెలలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో హింసాత్మక ఘర్షణలు జరిగిన తర్వాత రెండు దేశాల ఆర్మీ ఎదురుబడే ఉన్నాయి. ఈ స్టాండఫ్ పరిస్థితులను మరింత దిగజార్చే ముప్పు ఉన్నదనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వెలువడ్డాయి. జూన్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించారు. కాగా, చైనా వైపు మరణాలను ఆ దేశం వెల్లడించలేదు.
ఇప్పటి వరకు ఉభయ దేశాల మధ్య 15 రౌండ్ల మిలిటరీ చర్చలు జరిగాయి. గతేడాది రెండు వైపుల నుంచి సైనిక ఉపసంహరణ ముగిసింది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి గోగ్రా ఏరియా నుంచి ఉపసంహరణ పూర్తయింది.
ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ.. నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అంతేకాదు, ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని తెలిపారు. వచ్చే మరికొన్ని సంవత్సరాల్లో ఈ ఫీట్‌ను భారత్ సాధిస్తుందని, ఈ లక్ష్యాన్ని చేరకుండా భారత్‌ను మరే దేశం అడ్డుకోలేదని చెప్పారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ అమెరికాకే సూత్రప్రాయంగా పలు సంకేతాలు ఇచ్చారు. భారత్ అన్ని దేశాలతో సఖ్యతను కోరుకుంటుందని వివరించారు. అంతేకాదు, ఒక దేశానికి దగ్గర అయినంతమాత్రానా ఆ దేశ ప్రత్యర్థిని దూరం చేసుకోదని తెలిపారు. భారత్ ఎప్పుడూ అలా లేదని, ఇకపైనా అలా ఉండదని చెప్పారు. ఒక దేశంతో సఖ్యతగా ఉంటే.. దాని ప్రత్యర్థి దేశాన్ని దూరం పెట్టాలనే నియమాలనూ భారత్ పాటించదని పేర్కొన్నారు. తమ స్నేహం ఇరువర్గాలకు ఫలాలను ఇచ్చేలా
ఉంటుందని అన్నారు. రష్యా నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకోవడంపై అమెరికా గుర్రుగా ఉన్నది. ఈ అంశంపై అమెరికా, భారత్ మధ్య వ్యాఖ్యలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలోనే తాము అమెరికాకు దూరంగా జరగడం లేదనే సంకేతాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.