
భారతదేశంలోని వర్షాధార వ్యవసాయానికి నైరుతి రుతుపవనాలు జీవనాధారమనే సంగతి తెలిసిందే. అలాంటి నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. అయితే ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రుతుపవనాల సీజన్‌లో ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని India Meteorological Department మంగళవారం తెలిపింది.
‘‘ఈ రుతుపవనాల సగటు వర్షపాతం దీర్ఘకాల సగటులో 103 శాతం ఉంటుందని అంచనా వేయబడింది’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. నైరుతి ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని.. దీర్ఘకాల సగటులో 99 శాతం మాత్రమే వానలు పడొచ్చని ఐఎండీ ఈ ఏడాది ఏప్రిల్‌లో చెప్పిన సంగతి తెలిపిందే. రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో ఐఎండీ అంచనాలను సవరించింది.
మధ్య, ద్వీపకల్ప భారతదేశంలో దీర్ఘకాలం సగటు వర్షపాతంలో 106 శాతం వర్షాలు కురుస్తాయని మోహపాత్ర తెలిపారు. ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.
ఇక, ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎండలతో అల్లాడిన ప్రజల ఉపశమనం పొందుతున్నారు. సోమవారం ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక, ప్రస్తుతం రుతుపవనాల కదలిక కన్నూర్, పాలక్కాడ్ పరిసర ప్రాంతాల గుండా కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 5న తెలంగాణలో ప్రవేశించే రుతుపవనాలు జూన్ 5 లేదా 6వ తేదీల్లో పురోగమిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.