
BJP seeks resignation of Kejriwal, Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కేసును ప్రస్తావించిన ఢిల్లీ బీజేపీ.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిత్యం అవినీతిపై వ్యాఖ్యానించే ఆమ్ ఆద్మీ (ఆప్) అధినేత ఈ అంశంపై ఆప్ చీఫ్ వైఖరి ఆయన అవినీతిని క్షమించడమే కాకుండా, అందులో కూడా పాలుపంచుకున్నారని ఆరోపించింది. అంతకుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉపయోగించుకుని కావాలనే బీజేపీ కొత్త కుట్రకు తెరలేపిందని ఆమ్ ఆద్మీ ఆరోపించింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలోనే అక్కడ పరిస్థితలను పరిశీలిస్తున్న జైన్ ఇలా ఇరికించారనీ, ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని ఆరోపించింది.
అయితే, బీజేపీ దీనిని ఖండించింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన రాజకీయ ప్రతీకార ఆరోపణను తిరస్కరించారు. జైన్ అరెస్టు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలతో ముడిపడి ఉందనే వాదనను ఆయన ఖండించారు. అవినీతి కేసులో కేంద్ర సంస్థల చర్యలను ఏ కోర్టు కూడా రద్దు చేయలేదని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిపై ఏమాత్రం సహనం చూపదని, అక్రమార్జనను లక్ష్యంగా చేసుకుంటుందని భాటియా అన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, ఎన్నికల కారణంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ విచారణ ఏజెన్సీలను చర్య నుండి వెనక్కి తీసుకోమని అడగలేమని భాటియా అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ లు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేజ్రీవాల్ ఆదేశాల మేరకే ఆరోగ్య మంత్రి వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు. కేజ్రీవాల్‌కు నైతికత లేకుండా పోయిందని విమర్శించారు. పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా కూడా ఇటీవల అవినీతి కేసులో అరెస్టయ్యారని పేర్కొన్న భాటియా, ఆప్ "100 శాతం అవినీతి" రికార్డును కొనసాగించిందని ఆరోపించారు. జైన్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు తీవ్రమైనవని అన్నారు. కాగా, మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్టు చేసింది.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను మంగళవారం ఇక్కడి కోర్టు జూన్ 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపింది. ఈడీ కేసులో జైన్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ముందు హాజరుపరిచారు, ఈ కేసులో ఆయనను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. జైన్ బంధువులకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ అటాచ్ చేసింది. “జైన్ బంధువులైన స్వాతి జైన్, సుశీల జైన్, ఇందు జైన్‌లకు చెందిన వివిధ సంస్థలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేశారు. అకించన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో మెటల్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పర్యస్ ఇన్ఫోసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మంగ్లాయతన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెజె ఐడియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ లు చర్యలు తీసుకున్న సంస్థల లిస్టులో ఉన్నాయని” రిపోర్టులు పేర్కొంటున్నాయి.