ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారత పౌరులను తరలించాం: పార్లమెంటులో కేంద్ర మంత్రి జైశంకర్

Published : Mar 15, 2022, 05:24 PM ISTUpdated : Mar 15, 2022, 05:33 PM IST
ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారత పౌరులను తరలించాం: పార్లమెంటులో కేంద్ర మంత్రి జైశంకర్

సారాంశం

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించిన ఆపరేషన్ గంగ గురించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు పార్లమెంటులో మాట్లాడారు. రాజ్యసభకు ఈ ఆపరేషన్ సంబంధ వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్ కింద భారత్‌కు 22,500 మంది భారత పౌరులను తరలించామని చెప్పారు.

న్యూఢిల్లీ: గత నెల 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటికే ఆ దేశం నుంచి భారత పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలని ఎంబసీ పలుమార్లు సూచించింది. కానీ, చాలా మంది అక్కడే ఉండిపోయారు. రష్యా దాడులు ప్రారంభించగానే ఉక్రెయిన్ ఆ దేశ గగనతలాన్ని మూసేసింది. ఉక్రెయిన్ ఆ దేశ గగనతలాన్ని మూసేసిన రెండు రోజులకు భారత ప్రభుత్వం పౌరల తరలింపును ప్రారంభించింది. ఆపరేషన్ గంగ పేరిట ఈ తరలింపు ప్రక్రియను చేపట్టింది. ఈ రోజు పార్లమెంటులో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆపరేషన్ గంగ గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను ఈ ఆపరేషన్ కింద స్వదేశానికి తరలించిన తీరును వివరించారు.

ఎన్నో సవాళ్లతో కూడిన తరలింపు ప్రక్రియను నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసిందని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో సుమారు 20 వేల మంది భారత పౌరులు ప్రమాదంలో పడిపోయారని వివరించారు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు నెలకొనగానే ఆ దేశంలోని భారత పౌరుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంబసీ ప్రారంభించిందని తెలిపారు. ఎంబసీ హెచ్చరికలు జారీ చేసినా చాలా మంది విద్యార్థులు అక్కడే ఉండిపోవాలని తొలుత భావించారని పేర్కొన్నారు. విద్యా సంస్థలను వదిలి, చదువు పక్కన పెట్టి ఇంటికి రావడంపై ఉండ సహజమైన నిరాసక్తతతోనే వారు ఎంబసీ సూచనలకు అప్రమత్తం కాలేదని తెలిపారు. అలాగే, ఉక్రెయిన్‌లోని యూనివర్సిటీలు ఇందుకు మరో కారణంగా ఉన్నాయని వివరించారు. విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లిపోవడానికి, ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడానికి ఆ యూనివర్సిటీలు సుముఖతను చూపలేదని చెప్పారు.

ఉక్రెయిన్‌లో భారత పౌరులు విస్తారంగా వ్యాపించి ఉండటంతో వారిని ఒక చోటికి చేర్చి లేదా స్వదేశానికి తరలించడం చాలా కష్టంగా మారిందని కేంద్ర మంత్రి వివరించారు. లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కోవల్సి వచ్చిందని తెలిపారు. యుద్ధం జరుగుతున్న ఉద్రిక్త ప్రాంతాల నుంచీ భారత పౌరులను తరలించామని, ఎగ్జిట్ పాయింట్ల దగ్గరా సుమారు 26 లక్షల శరణార్థులు ఉన్నా భారత పౌరులను విజయవంతంగా తీసుకువచ్చామని వివరించారు. రష్యా వైమానిక దాడులు, క్షిపణి దాడులు జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి వారిని రక్షించడం క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖార్కివ్, సుమీ నగరాల నుంచి భారతీయులను తరలించడం కత్తి మీద సాములాగా మారిందని చెప్పారు.

ఈ తరలింపు ప్రక్రియలో అన్ని మంత్రిత్వ శాఖలు విజయవంతంగా సహకరించాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు 22,500 మంది భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చిందని వివరించారు. ప్రధాని మోడీ కూడా దాదాపు ప్రతి రోజూ సమీక్షా సమావేశాలు నిర్వహించారని, పౌర విమానయాన, రక్షణ, మంత్రిత్వ శాఖలు మొదలు ఎన్‌డీఆర్ఎఫ్, ఐఏఎఫ్, ప్రైవేటు విమానయాన సంస్థలూ సహకరించాయని చెప్పారు.

అదే సందర్భంలో ఉక్రెయిన్‌లో రష్యా దాడిలో మరణించిన భారత మెడికల్ స్టూడెంట్ నవీన్ శేఖరప్ప ప్రస్తావన చేశారు. ఆయన మృతదేహాన్ని భారత్‌కు తెస్తామని, కేంద్ర ప్రభుత్వం తరఫున తాము హామీ ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్
Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.