
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన నీట్ (NEET) వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపుతామని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (R N Ravi) తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (M K Stalin)కు హామీ ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తో సమావేశం అయ్యారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరిధి నుండి తమిళనాడును మినహాయించే బిల్లును త్వరగా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలని కోరారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తమిళనాడు ప్రభుత్వం నీట్ ను తమ రాష్ట్రంలో నిర్వహించకూడదని గట్టిగా పట్టుబడుతోంది. అందుకే నీట్ ను రద్దు చేసేందుకు మొదటి సారిగా సెప్టెంబరు 13, 2021న రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం యాంటీ నీట్ బిల్లును ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా 142 రోజుల తన వద్దే ఉంచుకున్నారు. అనంతరం ఆ బిల్లు పేద విద్యార్థులకు వ్యతిరేకం అంటూ దానిని తిరిగి పంపించారు. అయినా ప్రభుత్వం తగ్గకుండా ఫిబ్రవరి 8వ తేదీన ఈ బిల్లుపై మరో సారి ఓటింగ్ పెట్టేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఆ రోజు శాసన సభ ఈ యాంటీ నీట్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపింది.
2021లో సెప్టెంబర్ లో నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలం (selam) ప్రాంతంలో ఓ మెడికల్ సీటు ఆశవాహురాలు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీంతో నీట్ పై పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. మెడిసిన్, డెంటిస్ట్రీ, ఇండియన్ మెడిసిన్, హోమియోపతిలోని యూజీ కోర్సులకు ఎంట్రెన్స్ టెస్ట్ లో (12వ తరగతి) సాధించిన మార్కుల ఆధారంగా వచ్చే పదేళ్ల వరకు ప్రవేశాలు కల్పించాలని ఆ బిల్లులో పేర్కొంది.
ఇంజనీరింగ్ (engineering), మెడిసిన్ (medicine) సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం జేఈఈ మెయిన్స్ (JEE Mains), నీట్ (NEET) అనే పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు ప్రతీ ఏటా అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. కానీ తమిళనాడు ప్రభుత్వం నీట్ ను తమిళనాడులో నిర్వహించకూడదని చెబుతోంది. మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందాలంటే ఈ పరీక్ష తప్పని సరిగా మంచి మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంజనీరింగ్ లో సీట్లు పొందాలంటే స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ లో పలు ఎక్జామ్స్ ఉంటాయి.. కానీ మెడిసిన్ కోసం మాత్రం నీట్ ఒక్కటే ఉండటం సరైంది కాదని తమిళనాడు భావిస్తోంది.
వాస్తవానికి గతంలోనే నీట్ వల్ల వచ్చే సమస్యను అధ్యయనం చేసేందుకు స్టాలిన్ గవర్నమెంట్ ఒక కమిటీని నియమించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష ద్వారా మెడిసిన్ లో చేరిన స్టూడెంట్లు, ఇంటర్ మీడియట్ మార్కుల ఆధారంగా సీటు పొందిన వారికంటే బాగా రాణించడం లేదని ఆ కమిటీ చెప్పింది. కేవలం డబ్బులున్న స్టూడెంట్లు మాత్రమే నీట్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ లకు వెళ్లి, ఎక్కువ మార్కులు సాధించి అడ్మిషన్ పొందుతున్నారని ఆ కమిటీ తెలిపింది. అయితే అదే సమయంలో నీట్ ఒత్తిడి వల్ల ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. తమిళనాడులో ఇక నుంచి నీట్ నిర్వహించకూడదని నిర్ణయిస్తూ బిల్ పాస్ చేసింది.