
న్యూఢిల్లీ: అమెరికా విడుదల చేసిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదికపై భారత్ స్పందించింది. మన దేశం గురించి అమెరికా నివేదికలో ప్రస్తావించిన అఘాయిత్యాలను ఖండించింది. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని అమెరికా నివేదిక అంశాలు అసత్యాలు అని స్పష్టం చేసింది. అమెరికా సీనియర్ అధికారులు అర్థసత్యాలను మాట్లాడారని పేర్కొంది. విషయ అవగాహన లేకుండా మాట్లాడారని తెలిపింది. అంతేకాదు, అంతర్జాతీయ సంబంధాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నదని అమెరికాపై ఫైర్ అయింది. అంతేకాదు, అమెరికాలోనే జాత్యహంకార ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయని విమర్శించింది. పక్షపాత అభిప్రాయాలు, ప్రేరేపిత వనరుల నుంచి తీసుకున్న సమాచారమే ఆ రిపోర్టులో పొందుపరిచారని ఫైర్ అయింది.
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా రక్షణ శాఖ 2021 నివేదిక విడుదలను తాము చూశామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. సరైన విషయ అవగాహన లేని సీనియర్ అమెరికా అధికారుల వ్యాఖ్యలనూ తాము పరిశీలించామని వివరించారు. అంతర్జాతీయ సంబంధాల్లోనూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దురదృష్టకరం అని అన్నారు. అమెరికా నివేదిక కొన్ని ప్రేరేపిత ఇన్‌పుట్లు, పక్షపాత అభిప్రాయాలను మదించి రూపొందించారని ఆరోపించారు. ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని కోరారు.
సహజ సిద్ధంగా బహుళ జాతుల సమాజం భారత్‌లో ఉన్నదని, ఎప్పట్లాగే ఈ దేశం మత స్వేచ్ఛకు, మానవ హక్కులకు విలువ ఇస్తుందని అన్నారు. అమెరికాతో తమ చర్చల్లోనూ తాము అక్కడ జరుగుతున్న అన్యాయాలను, హక్కుల హననం గురించి లేవనెత్తామని తెలిపారు. జాత్యహంకార దాడులు, జాతి ప్రేరేపిత దాడులు, ద్వేషపూరిత నేరాలు, గన్ వాయిలెన్స్ గురించి చర్చించామని వివరించారు. ఈ దాడుల గురించి తమ ఆందోళనను వ్యక్తపరిచామని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా వార్షిక నివేదికను కాంగ్రెస్‌లో సమర్పించింది. ఈ నివేదిక మొత్తంగా ప్రపంచంలోని మత స్వేచ్ఛను.. అలాగే.. ప్రత్యేకంగా సెక్షన్‌ల వారీగా దేశాల్లోని మత స్వేచ్ఛ వివరాలను పొందుపరించింది. ఈ నివేదిక భారత్‌పైనా మీడియా కథనాలు, ప్రభుత్వ ఏజెన్సీల వివరాల ఆధారంగా సమాచారాన్ని పేర్కొంది. అయితే, సొంత అభిప్రాయం ఇవ్వకుండా అమెరికా జాగ్రత్త పడింది. ఈ నివేదికలో భారత్‌లో మత స్వేచ్ఛ హరించిందనేలా వివరాలను పొందుపరిచింది.
2021 సంవత్సరం పొడుగునా మైనార్టీలపై దాడులు, బెదిరింపులు, వారి హత్యలూ జరిగాయని అమెరికా రక్షణ శాఖ పొందుపరించిన ఈ నివేదిక తెలిపింది. శుక్రవారం ఈ రిపోర్టు విడుదల చేస్తున్న సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, భారత్‌లో ప్రజలపై దాడులు పెరిగాయని అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దాడులు జరుగుతున్నాయని వివరించారు. భారత్‌లో కొందరు అధికారులు ప్రజలపై దాడులు, ప్రార్థనా ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని, ఇంకొందరు అధికారులు ఆ దాడులకు సహకరిస్తున్నారనీ అమెరికా అంబాసిడర్ రషద్ హుస్సేన్ వివరించారు. అదే సందర్భంలో జమ్ము కశ్మీర్‌లోనూ హిందువులు, కశ్మీరీలపై జరుగుతున్న అఘాయిత్యాలను రికార్డు చేసింది.
గో రక్షణ పేరిట మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని అమెరికా రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్టు పేర్కొంది. పశువుల వధ, వ్యాపారం ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నాయని వివరించింది. అంతేకాదు, మత మార్పిడికి సంబంధించిన చట్టాలనూ పలు రాష్ట్రాలు తెచ్చాయని తెలిపింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు మత మార్పిడిని అడ్డుకుంటూ చట్టాలు తెచ్చాయని వివరించింది. కాగా, 25 రాష్ట్రాలు పాక్షికంగా లేదా పూర్తిగా పశువుల వధ, వ్యాపారాన్ని నిషేధిస్తూ చట్టాలు రూపొందించాయని పేర్కొంది.
అలాగే, ఫారీన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) 2020 సవరణపైనా భారత దేశంలోని ఎన్జీవోల విమర్శలను ఈ రిపోర్టు రికార్డు చేసింది. కొన్ని మతపరమైన ఎన్జీవోలో తమ కార్యకలాపాల నిర్వహణకు ఈ సవరణ బంధనాలు విధించినట్టు పేర్కొన్న విమర్శలను పొందుపరించింది.