భారతదేశంలో కోరనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13 వేలు దాటింది. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రమాదంగా పరిణమిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 449 మంది మృత్యువాత పడ్డారు.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13,500కు చేరుకుంది. మరణాలు 449కి చేరుకున్నాయి. మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారంనాడు ఒక్క రోజే 361 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదైన సంఘటనల్లో ఇది రెండోది
గుజరాత్ లో కూడా కోవిడ్ -ొ19 విజృంభిస్తోంది. మహారాష్ట్ర గురించి చెప్పనక్కరలేదు. గురువారం ఒక్క రోజే దేశంలో 1,260 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ -19 ప్రమాదకరంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం 244 కేసులు నమోదయ్యాయి. దాంతో అత్యధిక కరోనా వైరస్ సోకిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మూడో స్థానానికి చేరుకుంది.
మహారాష్ట్రలో కొత్త 286 కేసులు నమోదయ్యాయి. అత్యధిక కోవిడ్ -19 కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. గురువారంనాటికి మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. ముంబైలో గురువారం ఒక్క రోజే 177 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,073కు చేరుకుంది.
ఢిల్లీలో కొత్తగా ఆరు కరోనా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 1,640 కేసులు నమోదు కాగా 38 మంది మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 7 మరణాలు, గుజరాత్ లో మూడు మరణాలు సంభవించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇద్దరేసి మరణించారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 449కి చేరుకుంది.