కరోనా మృతులు.. మూడో స్థానానికి చేరుకున్న భారత్

By telugu news teamFirst Published Aug 29, 2020, 7:24 AM IST
Highlights

మరోవైపు భారతదేశంలో క‌రోనా మృతుల సంఖ్య‌ మెక్సికో కంటే కాస్త ఎక్కువ‌గా అంటే 62,635గా ఉంది. ప్రస్తుతం క‌రోనా మృతుల విష‌యంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది.

కరోనా మహమ్మారి భారత దేశంలో విలయతాండవం చేస్తోంది. ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ 60వేలకు తక్కువ కేసులు నమోదు కావడం లేదు. ఇటీవల 70వేలకు కూడా పెరిగిపోతున్నాయి. కాగా... మరణాల రేటు కూడా భారీగా పెరుగుతోంది.

ప‌్ర‌పంచంలో కరోనా కేసులలో మూడవ స్థానానికి చేరిన‌ భార‌త్ ఇప్పుడు మృతుల ప‌రంగానూ ఇదే స్థానానికి చేరువ‌య్యింది. అయితే అన‌ధికారిక‌ రికార్డుల ప్ర‌కారం మెక్సికో మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ క‌రోనాతో 62,594 మంది మృత్యువాత ప‌డ్డారు. మరోవైపు భారతదేశంలో క‌రోనా మృతుల సంఖ్య‌ మెక్సికో కంటే కాస్త ఎక్కువ‌గా అంటే 62,635గా ఉంది. ప్రస్తుతం క‌రోనా మృతుల విష‌యంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో కరోనా కారణంగా లక్షా 85 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది. అక్కడ కరోనాతో ఇప్పటివరకు లక్షా 19 వేలకు పైగా జ‌నం ప్రాణాలు కోల్పోయారు.

జూన్ నుంచి లాక్‌డౌన్ మిన‌హాయింపులు ఇవ్వడంతో కొత్తగా కరోనా కేసుల న‌మోదుతోపాటు మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వ‌స్తోంది. మే నెలాఖరులో 10 ల‌క్ష‌ల‌ జనాభాకు మరణాల సంఖ్య ఐదుగా ఉన్న భారత్‌లో, ఇప్పుడు ఆ సంఖ్య 45కు చేరుకుంది. కాగా ప్రపంచంలోని ప‌లు దేశాలలో ఇప్పుడు కొత్త కేసులు, కరోనా మరణాలు తగ్గుతున్నాయి. కాగా దేశంలో వరుసగా మూడవ రోజు 76 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇప్పుడు 34 ల‌క్ష‌ల‌ను దాటింది. వీరిలో 26 లక్షలకు పైగా బాధితులు కరోనాతో జ‌రిగిన యుద్ధంలో విజయం సాధించగా, 62 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 

click me!