Pegasus: పెగాసెస్‌ను కేంద్రమే కొనుగోలు చేసిందంటూ పరిశోధనాత్మక కథనం.. మోడీ ప్రస్తావనతో సంచలనం

By Mahesh KFirst Published Jan 29, 2022, 12:57 PM IST
Highlights

పెగాసెస్ స్పైవేర్‌పై న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, భారత ప్రభుత్వం, ఇజ్రాయెల్ మధ్య 2017లో ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఆయుధాలతోపాటు ఇంటెలిజెన్స్ గేర్‌లో భాగంగా స్పైవేర్ పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి డీల్ కుదిరిందని వివరించింది. ఈ కథనంలో ప్రధాని మోడీ 2017లో ఇజ్రాయెల్‌లో చేసిన పర్యటననూ పేర్కొంది. ఈ పెగాసెస్ స్పైవేర్‌పై డీల్ కుదిరిన తర్వాతే భారత ప్రభుత్వం ఐరాసలో పాలస్తీనియాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓటేసిందని తెలిపింది.
 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పెగాసెస్ స్పైవేర్‌(Spyware Pegasus)పై ఓ పరిశోధనాత్మక కథనం సంచలన విషయాలను వెల్లడించింది. గతేడాది ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలకు కారణమైన ఈ ఇజ్రాయెల్ స్పైవేర్‌పై న్యూయార్క్ టైమ్స్(NYT) కొన్నేళ్లపాటు పరిశోధన చేసి ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థించే విషయాలను పేర్కొంది. భారత ప్రభుత్వం చేసుకున్న సమర్థనలను శంకించే షాకింగ్ అంశాలను ముందుకు తెచ్చింది. భారత ప్రభుత్వమే ఆ ఇజ్రాయెలీ(Israel) స్పైవేర్ పెగాసెస్‌ను కొనుగోలు చేసిందని పేర్కొంది. అధునాతన ఆయుధాలతోపాటు ఇంటెలిజెన్స్ గేర్‌ కొనుగోలుపై భారత ప్రభుత్వానికి, ఇజ్రాయెల్‌కు మధ్య 2017లో ఒప్పందం కుదిరిందని తెలిపింది. తన కథనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi)ని ప్రస్తావించింది.

ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఎన్‌ఎస్‌వో సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ స్పైవేర్‌పై గతేడాది పరిశోధనాత్మక కథనాలు వెలువడ్డాయి. భారత ప్రభుత్వం ఈ స్పైవేర్ ఉపయోగించి ప్రధాన ప్రతిపక్ష నేతలు, మానవ హక్కుల రక్షణకు పని చేస్తున్న కార్యకర్తలు, రాజకీయనేతలు, పాత్రికేయులు, న్యాయవాదులు, విమర్శకులపై నిఘా వేస్తున్నదని ఆరోపణలు చేశాయి. దీంతో వ్యక్తిగత గోప్యత అంశంపై అనేక చర్చలు జరిగాయి. తాజాగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం మరోసారి సంచలనానికి కేంద్రమైంది. ఎన్‌ఎస్‌వో గ్రూప్ సుమారు దశాబ్ద కాలంగా నిఘా వేయడానికి దేశాలకు తమ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను విక్రయిస్తున్నదని ఆ కథనం పేర్కొంది. ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు సహా వేరే ఏవీ కూడా అందించని విధంగా ఇంటెలిజెన్స్ సేవలు అందిస్తామనే హామీతో ఈ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతున్నదని తెలిపింది. 

ఈ కథనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రస్తావించింది. 2017లో ఆయన చేసిన ఇజ్రాయెల్ పర్యటనను పేర్కొంది. దశాబ్దాలుగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ వైపు నిలబడింది. కానీ, మోడీ ప్రభుత్వం.. ఇజ్రాయెల్‌తో మరుగునపడిన సంబంధాలకు జవజీవాలను అందించిందని వివరించింది. 2017లో ఆయన పర్యటన జయప్రదంగా ముగిసింది. ఆ ముగింపులు ప్రధాని మోడీ.. అప్పటి ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహులు స్థానిక బీచ్‌లో నడుచుకుంటూ మాట్లాడుకున్నారని పేర్కొంది. వారంతా రిలాక్స్‌గా ముచ్చటించడం వెనుక ఒక ఫలప్రదమైన డీల్ ఉన్నదని తెలిపింది. సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, స్పైవేర్‌ పెగాసెస్‌కు సంబంధించిన డీల్ కుదిరిందని వివరించింది. ఆ తర్వాతే కొన్ని నెలలకు బెంజమిన్ నెతన్యాహు భారత్ కూడా పర్యటించారు. ఇది చాలా అరుదు. అనంతరం 2019లో భారత ప్రభుత్వం అనూహ్యంగా ఐరాసలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓటేసింది. ఇలా పాలస్తీనియన్ మానవ హక్కుల సంఘానికి పర్యవేక్షక స్థాయిని తొలగించడానికి ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓటు వేయడం గమనార్హం.

స్పైవేర్ పెగాసెస్‌పై భారత్ సహా పలు దేశాల్లో అభ్యంతరాలు, ఆందోళనలు బయల్దేరడంతో దానిని సృష్టించిన ఎన్‌ఎస్‌వో గతంలో స్పందించింది. తాము తమ ఇంటెలిజెన్స్ సేవలను దుర్వినియోగం చేయడం లేదని, తమ సాఫ్ట్‌వేర్‌ను కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే విక్రయిస్తామని వివరించింది. దీంతో గతేడాది ఆందోళనలు బలంగా జరిగాయి. ప్రభుత్వమే స్వయంగా తమపై నిఘా వేసి తమ హక్కులను కాలరాస్తున్నదని చాలా మంది యాక్టివిస్టులు ఆందోళనలు చేశారు. వీటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ నిఘాపై దర్యాప్తు చేయడానికి అంగీకరించింది. ఎప్పుడూ దేశ భద్రతా విషయం అంటూ అన్ని విషయాల నుంచి కేంద్రం తప్పించుకోలేదని సుప్రీంకోర్టు స్పందించింది. ముగ్గురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.

click me!