18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్:దేశ ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగం

By narsimha lodeFirst Published Jun 7, 2021, 5:13 PM IST
Highlights

కరోనాతో దేశ ప్రజలు  ఎంతో బాధను అనుభవించారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.  కరోనాపై పోరాటం చరిత్రలో నిలిచిపోతోందన్నారు.  కరోనా నుండి వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తోందని ఆయన చెప్పారు. 
 

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకొంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ ఏడాది జూన్ 21 నుండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కూడ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ఆయన తెలిపారు. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 75 శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రమే సరఫరా చేస్తోందని ఆయన చెప్పారు. 25 శాతం వ్యాక్సిన్ డోసులు ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేయవచ్చని మోడీ తెలిపారు. 

 టీకాల కొనుగోలుపై విపక్షాలు అనవసర రాద్దాతం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. టీకాలను కొనుగోలు చేసి కేంద్రమే రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడ వ్యాక్సిన్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.ప్రైవేట్ ఆసుపత్రులు రూ.150 కంటే ఎక్కువ ఫీజును వ్యాక్సిన్ కు వసూలు చేయవద్దని ఆయన కోరారు. అభివృద్ది చెందిన అనేక దేశాల కంటే ఇండియాలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుండి వ్యాక్సిన్ రావడానికి ఏళ్ల సమయం పట్టేదన్నారు. వాళ్ల అవసరాలు తీరాకే  మనకు వ్యాక్సిన్ అందించేవాళ్లని ఆయన అభిప్రాయపడ్డారు.

 యద్ద ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఇంత పెద్ద జనాబా ఉన్న దేశంలో వ్యాక్సినేషన్ ఎలా చేస్తారని ప్రపంచం ఆసక్తిగా చూసిందన్నారు.  స్వదేశీ సంస్థల టీకా ఉత్పత్తితో ప్రపంచానికి మన శక్తి ఎమిటో చూపించామని ఆయన చెప్పారు.  గత ఏడాది ఏప్రిల్ లోనే వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసుకొన్నామని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు అన్ని రకాల సహాయం అందించినట్టుగా ఆయన తెలిపారు. మరో మూడు కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు.  దేశ విదేశాల నుండి టీకాలను తెప్పిస్తున్నామన్నారు. విదేశాల నుండి మందు కూడ తెప్పిస్తున్న విషయాన్ని ఆయన ప్రజలకు చెప్పారు. 

దేశంలో ప్రస్తుతం ఆరు కంపెనీలు వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. మరో మూడు కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియను చేపట్టాయని ఆయన వివరించారు. మరో రెండు కొత్త వ్యాక్సిన్లు కూడ రానున్నాయని ఆయన ప్రకటించారు.  కరోనా సెకండ్ వేవ్ పై పోరాటం కొనసాగుతోందన్నారు. వందేళ్లలోన ఇలాంటి మహమ్మారిని చూడలేదని ఆయన చెప్పారు. కరోనాతో దేశ ప్రజలు  ఎంతో బాధను అనుభవించారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.  కరోనాపై పోరాటం చరిత్రలో నిలిచిపోతోందన్నారు.  కరోనా నుండి వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తోందని ఆయన చెప్పారు. దేశ చరిత్రలో మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ  ఇంతగా అవసరపడలేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ను ఉపయోగించి ఆక్సిజన్ కొరత తీర్చామన్నారు. వైద్య రంగంలో మౌళిక వసతులను పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏడాదిలో రికార్డుస్థాయిలో ల్యాబ్ లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.మరో వైపు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం దీపావళి వరకు కొనసాగిస్తామని మోడీ ప్రకటించారు. 
 

click me!