
న్యూఢిల్లీ: శ్రీలంకలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అత్యంత దారుణమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటున్నది. ప్రధానమంత్రి, అధ్యక్షుడు వెంటనే రాజీనామాలు చేయాలని ప్రజలు రోడ్డెక్కారు. ప్రధానమంత్రి మహింద రాజపక్సె అనుచరులు నిరసనకారులపై దాడికి దిగడంతో శ్రీలంక మొత్తం అగ్నిగుండంగా మారింది. ప్రధానిగా రాజీనామా చేసిన మహింద రాజపక్సె ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. అయితే, ఈ నేపథ్యంలోనే శ్రీలంక మీడియా, సోషల్ మీడియాలో కొన్ని వదంతులు వస్తున్నాయి. శ్రీలంకకు భారత్ మిలిటరీ బలగాలను పంపిస్తున్నదని ఆ వదంతులు స్థూలంగా చెబుతున్నాయి.
ఈ వదంతులను భారత హైకమిషన్ కొట్టిపారేసింది. శ్రీలంకకు భారత్ తన మిలిటరీ బలగాలను పంపుతున్నదని వస్తున్న వదంతులను ఖండిస్తున్నట్టు పేర్కొంది. అలాంటి ఆలోచనలు భారత ప్రభుత్వం చేయట్లేదని స్పష్టం చేసింది. శ్రీలంక ప్రజాస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందని, శ్రీలంకలో మళ్లీ ఆర్థిక స్థిరత్వం నెలకొంటుందని ఆశిస్తున్నట్టు వివరించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిది అరిందమ్ బాగ్చి మంగళవారం శ్రీలంక సంక్షోభంపై చేసిన వ్యాఖ్యలను భారత హైకమిషన్ ఉటంకించింది.
"కొందరు రాజకీయ వ్యక్తులు మరియు వారి కుటుంబాలు భారతదేశానికి పారిపోయారని మీడియా మరియు సోషల్ మీడియా విభాగాలలో పుకార్లు వ్యాపించడాన్ని హైకమిషన్ ఇటీవల గమనించింది. ఇవి నకిలీ మరియు కఠోరమైన తప్పుడు నివేదికలు.. ఇందులో ఎటువంటి నిజం లేదు.. భారత హైకమిషన్ వాటిని తీవ్రంగా ఖండించింది" అని ఒక ప్రకటన తెలిపింది. శ్రీలంక స్వతంత్య్రం పొందినప్పటి నుంచి ఎప్పుడు చూడని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి ఆ దేశ మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, ఆయన కుటుంబ రాజకీయ నాయకులే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే, ప్రజలు సైతం వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు దిగారు.
ఆందోళనలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న వేళ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం నాడు మహీందా రాజపక్సే ప్రకటించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా రాజీనామా లేఖలను అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు అందించారు. మహీందా రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వ అనుకూల మద్దతు దారులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో చనిపోయారని వందల మంది గాయపడ్డారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఘర్షణల అనంతరం నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను హోరెత్తించారు. ఈ క్రమంలోనే అధికార పార్టీలోని మంత్రులకు చెందిన ఆస్తులతో పాటు రాజపక్సే కుటుంబానికి చెందిన ఆస్తులకు నిప్పుపెట్టారు. పరిస్థితి మరింతగా దిగజారడంతో అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఆర్మీకి సూపర్ పవర్స్ ను ఇచ్చారు. ఆందోళనకారులు కనిపిస్తే.. కాల్చివేసే ఆర్డర్స్ ను జారీ చేశారు.
అయితే, భారత్ గతంలో తన బలగాలను శ్రీలంకకు పంపింది. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ 1987, 1990లో శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి సేవలు అందించాయి. శ్రీలంక అంతర్యుద్ధం నుంచి కోలుకోవడానికి ఆ దేశ విజ్ఞప్తి మేరకు భారత్ ఈ బలగాలను పంపింది. ముఖ్యంగా తమిళ మిలిటెంట్లకు, శ్రీలంక ఆర్మీకి మధ్య నెలకొన్న యుద్ధంలో శ్రీలంక ప్రభుత్వానికి అండగా అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జేఆర్ జయవర్దెనే విజ్ఞప్తి మేరకు భారత బలగాలు ద్వీప దేశంలో అడుగుపెట్టాయి. అది కూడా అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ఇండో శ్రీలంక అకార్డ్ మేరకు భారత బలగాలు శ్రీలంకకు వెళ్లాయి.