
కరోనా వైరస్ విలయతాండవం రోజు రోజుకీ పెరిగిపోతోంది. భారత్ లో ఇది మరింత ప్రమాదకర స్థాయికి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలలో మూడో స్థానానికి చేరుకున్న కరోనా.. మరికొద్ది రోజుల్లో అమెరికాని వెనక్కి నెట్టి మొదటి స్థానానికి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది చలికాలం ముగిసే సమయానికి భారత్ లో ప్రతి రోజూ 2.87లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1.12 కోట్లకు చేరుకోగా.. 5.46 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం నమోదైన దానికంటే దాదాపు 12రెట్లు ఎక్కువగానే ఉండవచ్చని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, మరణాల సంఖ్య కూడా రెట్టింపు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక వ్యవస్థలతోపాటు మానవ జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోన్న ఈ మహమ్మారిని సమర్థంగా కట్టడిచేయకుంటే 2021 మార్చి నాటికి 25కోట్ల మంది ఈ వైరస్ బారినపడడంతోపాటు 18లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు ఎంఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ప్రస్తుతం ఎటువంటి ఔషధాలు, టీకాలు అందుబాటులో లేకపోవడంతో పరిశుభ్రత, భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేశారు. మార్చి మధ్యకాలం నుంచి ఆయా దేశ జనాభాలో నిత్యం 0.1శాతం మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసివుంటే లక్షల సంఖ్యలో వైరస్ కేసులు తగ్గించే అవకాశం ఉండేదని ఎంఐటీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
కొద్ది రోజుల్లోనే.. భారత్ తొలి స్థానానికి చేరుకోగా.. వాటి తర్వాత అమెరికా, దక్షిణాఫ్రికా, ఇరాన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.