ఒకేరోజు రికార్డు స్థాయి కేసులు, మరణాలను నమోదు చేసుకుని.. బ్రిటన్ (2.90 లక్షలు), స్పెయిన్(2.89లక్షలు)ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 9,996 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,95,772కు చేరుకుంది.
భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ వేలసంఖ్యలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఊహించని విధంగా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య నమోదౌతోంది. కాగా.. తాజాగా ఈ కేసుల విషయంలో భారత్ ఓ రికార్డు క్రియేట్ చేసింది.
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచదేశాల్లో నాలుగో స్థానానికి చేరింది. ఒకేరోజు రికార్డు స్థాయి కేసులు, మరణాలను నమోదు చేసుకుని.. బ్రిటన్ (2.90 లక్షలు), స్పెయిన్(2.89లక్షలు)ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 9,996 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,95,772కు చేరుకుంది.
వైరస్ బారిన పడిన వారిలో 357 మంది మరణించగా.. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 8,102కు చేరింది. వరసగా రెండో రోజు కూడా యాక్టివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. మొత్తం 1.41 లక్షల మంది కోలుకున్నారు.
రికవరీల్లో రాజస్థాన్ 74 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. 69 శాతంతో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా 49.21శాతం రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఇక మహారాష్ట్రలో వైరస్ ఉధృతి తగ్గడం లేదు. కేవలం ఒక్క మహారాష్ట్ర లోనే ఒక్క రోజులోనే 152 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 97,648కి చేరింది. దేశం మొత్తంలో 8,102 మంది చనిపోగా ఒక్క మహారాష్ట్రలోనే 3,590 మంది మరణించారు. తమిళనాడులో గురువారం 1,875 కేసు లు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 38,716కు చేరుకుంది. అటు కర్ణాటకలోనూ 204 కొత్త కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతిచెందారు.
ఇదిలా ఉండగా.. రష్యాలోనూ వైరస్ విలయ తాండవం చేస్తోంది. తాజాగా దేశంలో పాజిటివ్‌ల సంఖ్య 5 లక్షల మార్కుని దాటేసినట్టు అధికారులు వెల్లడించారు. 24 గంటల్లో 8,799 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం కేసులు 5,02,436కి చేరుకున్నాయి.
వారిలో ఇప్పటి వరకు 6,532 మంది మృతిచెందారు. రోజూ ఇక్కడ 9 వేల కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం మాస్కోతో సహా అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ వస్తోంది.