
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్దృతి క్రమంగా తగ్గుతుంది. తాజాగా రోజువారీ కేసులు 58 రోజుల కనిష్టానికి చేరాయి. అయితే మరణాలు మాత్రం తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. తాజాగా 1.20లక్షల మందికి కరోనా సోకగా, 3,380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
శుక్రవారం 20,84,421 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 1,20,529 మందికి వైరస్ సోకింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,86,94,879కి చేరింది.
24 గంటల వ్యవధిలో 3,380 మంది మహమ్మారికి బలయ్యారు. ముందు రెండు రోజులు మూడువేలకు దిగువనే మరణాలు సంభవించినప్పటికీ తాజాగా పెరుగుదల కనిపించింది. ఇప్పటివరకు 3,44,082మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల రేటు 1.19 శాతంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం దేశంలో 15,55,248మంది కోవిడ్ తో బాదడుతున్నారు. క్రియాశీలరేటు 5.73శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 1,97,894 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు వైరస్ ను జయించినవారి సంఖ్య 2,67, 95,549 మందికి చేరింది. రికవరీ రేటు 93.08 శాతానికి పెరిగింది.
జూన్ 4న 36,50,050 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 22,78,60,317.