చైనా కుటిలనీతి: 800 గొర్రెలతో నోరు మూయించిన వాజ్‌పేయ్

By Siva KodatiFirst Published Jun 26, 2020, 7:32 PM IST
Highlights

డ్రాగన్‌ కుటిలనీతికి గట్టి సమాధానం చెప్పారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్. ఇండో చైనా వార్ ముగిసిన తర్వాత 1965 ప్రాంతంలో మరోసారి మనదేశంపై సైనిక చర్యకు దిగాలని డ్రాగన్ స్కెచ్ వేసింది

గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత ఇండో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు అలాగే కొనసాగుతున్నాయి. సైనిక ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఇరు వర్గాలు వెనక్కి తగ్గినప్పటికీ, బోర్డర్‌లో గరం గరంగానే ఉంది.

ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. ఈ క్రమంలో చైనాకు గట్టి గుణపాఠం చెప్పాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో డ్రాగన్‌ కుటిలనీతికి గట్టి సమాధానం చెప్పారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్.

ఇండో చైనా వార్ ముగిసిన తర్వాత 1965 ప్రాంతంలో మరోసారి మనదేశంపై సైనిక చర్యకు దిగాలని డ్రాగన్ స్కెచ్ వేసింది. దీనిలో భాగంగా సిక్కిం సరిహద్దు దాటి తమ దేశానికి చెందిన వ్యక్తుల నుంచి 800 గొర్రెలు, 59 జడల బర్రెలను భారత సైన్యం దొంగిలించిందని ఆరోపించింది.

అయితే చైనా ఆరోపణను మనదేశ అధినాయకత్వం కొట్టిపారేసింది. దీనిపై ఇరుదేశాల మధ్య కొన్నాళ్ల పాటు లేఖల యుద్ధం సాగింది. తమ గొర్రెలను, బర్రెలను తిరిగివ్వాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారత ప్రభుత్వాన్ని చైనా హెచ్చరించింది.

దీనిని అర్థం చేసుకున్న అప్పటి యువ ఎంపీ వాజ్‌పేయ్ వినూత్న రీతిలో డ్రాగన్‌కు బుద్ధి చెప్పారు. దీనిలో భాగంగా దాదాపు ఎనిమిది వందల గొర్రెలను ఢిల్లీలో ఉన్న చైనా ఎంబసీకి తోలుకెళ్లారు.

వాటి మెడలో మమ్మల్ని తినండి.. కానీ ప్రపంచాన్ని కాపాడండి అంటూ ఫ్లకార్డులు వ్రేలాడదీశారు. గొర్రెలు, బర్రెల పేరుతో చైనా ప్రపంచయుద్ధానికి తెరలేపుతోందని విమర్శించారు. వాజ్‌పేయ్ గొర్రెల నిరసనకు డ్రాగన్ విస్తుపోయింది. వెంటనే తమ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి ఘాటైన లేఖ రాసింది. గొర్రెల నిరసన వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందని ఆరోపించింది.

ఇందుకు తిరిగి లేఖ రాసిన మన ప్రభుత్వం నిర్మలమైన పదజాలాన్ని వాడుతూ.. ఢిల్లీ వాసులు కొందరు 800 గొర్రెలను చైనా ఎంబీసీలోకి తోలారు. ఇది ఊహించని విధంగా జరిగిన పరిణామం. నిరసన కూడా ప్రశాంతంగా జరిగిందని అంటూ జవాబిచ్చింది. 

click me!