Union Budget: బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానులు వీరే..

By Rajesh Karampoori  |  First Published Jan 25, 2024, 7:59 AM IST

Union Budget: ఏటా కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటారు. అయితే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దేశ ప్రధాన మంత్రులే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాల్సి వచ్చింది.  అలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రధానులు, అందుకు గల కారణాలేమిటో తెలుసుకుందాం..


Union Budget: ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రి దేశ సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతారు. ఈ ఏడాది  ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణ బడ్జెట్ అనేది దేశ ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఖాతా అని, దానిని సమర్పించే బాధ్యత సాధారణంగా ఆర్థిక మంత్రిపై ఉంటుంది.

అయితే.. భారత బడ్జెట్ చరిత్రలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దేశ ప్రధాన మంత్రులే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాల్సి వచ్చింది. అలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రధానులు, అందుకు గల కారణాలేమిటో ఓసారి తెలుసుకుందాం. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఆర్ధిక మంత్రి కాకుండా..ప్రధాన మంత్రే మూడు సందర్భాల్లో పార్లమెంట్‌లో  బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అందులో తొలిసారి.. 

Latest Videos

తొలి సందర్భం -జవహర్‌లాల్ నెహ్రూ

భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే దేశ సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆయన ప్రధానిగానే కాకుండా దేశ ఆర్థిక మంత్రిగా కూడా ఒకటి కాదు రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. అన్నింటిలో మొదటిది 24 జూలై 1956 నుండి 30 ఆగస్టు 1956 వరకు నెహ్రూ మొదటిసారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. దీని తరువాత  13 ఫిబ్రవరి 1958 నుండి 13 మార్చి 1958 వరకు (కేవలం 29 రోజులు) ఆర్థిక మంత్రిగా కొనసాగాడు. ఆయన బడ్జెట్‌ను సమర్పించాల్సిన సమయం ఇది. వాస్తవానికి.. అప్పటి నెహ్రూ ప్రభుత్వంలో ముంద్రా కుంభకోణం కారణంగా ఆనాటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీని కారణంగా.. ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించారు.

రెండో సందర్భం- ఇందిరా గాంధీ

ఇందిరా గాంధీ కూడా పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం చేసిన ప్రధాని ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో కూడా అలాంటిదే జరిగింది. ఆనాటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యత ఇందిరా గాంధీ భుజాలపై పడింది. దీంతో ఇందిర గాంధీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 1970-71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించారు.

మూడో సందర్భం - రాజీవ్‌గాంధీ

దేశ ప్రధానిగా ఉంటూ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మూడో ప్రధాని కూడా గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందినవారే. అవును..  మనం మాట్లాడుతున్నది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి.. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. దేశ ఆర్థిక బడ్జెట్‌ను సమర్పించారు. అప్పటి ప్రభుత్వం నుంచి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ వైదొలిగిన తర్వాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1987-88 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఇలా మూడు పర్వాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన అవకాశం గాంధీ కుటుంబానికే దక్కింది. 

click me!