
Independence Day celebrations: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైన తరుణంలో బాంబులు పెట్టినట్టు బెదిరింలు కాల్స్ రావడం కలకలం రేపుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు నగరంలో బాంబులు అమర్చినట్లు ఢిల్లీ పోలీసులకు కాల్స్ వచ్చాయి. శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్‌లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ హై అలర్ట్ ప్రకటించారు.
అనేక పోలీసు బృందాలు బాంబు-డాగ్ స్క్వాడ్‌లతో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శ్రమశక్తి భవన్ సమీపంలో అమర్చిన బ్యాగులో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం అది ఎలక్ట్రీషియన్ కు చెందినదిగా గుర్తించి బ్యాగును అతడికి అప్పగించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బ్యాగ్ లో ఎలక్ట్రికల్ పనులకు ఉపయోగించే టూల్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు.
అలాగే, ఎర్రకోట, కాశ్మీర్ గేట్, సరితా విహార్ లోని ప్రాంతాల్లో ఉన్న బ్యాగులను సైతం అధికారులు తెరిచి పరీక్షించారు. అయితే, వాటిలో ఎలాంటి పేలుడు పదర్థాలు గుర్తంచలేదని పేర్కొన్నారు. ఈ బాంబులకు సంబంధించిన సమాచారం పోలీసు శాఖలో కలకలం రేపింది. రంగంలోని దిగిన ప్రత్యేక అధికారులు, విచారణ జరిపిన కొద్దిసేపటి తర్వాత అవన్నీ బోగస్ కాల్స్ గా పేర్కొన్నారు. విచారణలో అనుమానాస్పదంగా ఏమీ తేలకపోవడంతో శ్రమశక్తి భవన్ సమీపంలో పోలీసులు ట్రాఫిక్ ను ఆంక్షలను తొలగించారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిఘా సంస్థలతో పాటు వివిధ కేంద్ర బలగాలు సైతం అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.