పెరుగుతున్న చలిగాలులు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం : ఐఎండీ

By Mahesh RajamoniFirst Published Dec 22, 2022, 12:07 PM IST
Highlights

New Delhi: దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. చలి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదల ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లుగుతోంది.
 

Weather Reports-IMD: దేశంలో చ‌లిగాలులు తీవ్ర‌త అధికం కావ‌డంతో చ‌లి తీవ్ర‌త పెరుగుతోంది. ఉష్ణోగ్ర‌త‌లు సైతం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లుగుతోంది. ప్ర‌స్తుతం మారుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయ‌నీ, వ‌ర్షాలు సైతం ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన చలి ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ముఖ్యంగా ఉత్తర-తూర్పు భారతదేశంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పొగమంచు కనిపించే అనేక రాష్ట్రాలు ఉన్నాయి. రోడ్లపై వాహనాలు రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది. ప‌లు చోట్ల ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సీజన్‌లో మొదటి తీవ్రమైన చలి కారణంగా ప్రజలు తమ ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మార్కెట్లలో దుకాణాదారులు చ‌లి మంటలు వేసి చలి నుంచి కాపాడుకుంటూ కనిపించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో చల్లదనం మరింత పెరిగింది. అంతే కాదు ఈ చలి మధ్యలో పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాయి. 

ఈ రాష్ట్రాల్లో చలిగాలుల మ‌రింత‌ వ్యాప్తి 

డిసెంబర్ 23 నుండి దేశంలో చలిగాలుల వ్యాప్తి మ‌రింత‌గా పెరుగుతుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. దేశ రాజ‌ధాని ఢిల్లీ, హిమాచల్ ప్ర‌దేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర రాజస్థాన్‌లలో రానున్న ఐదు రోజుల పాటు చలిగాలుల ప్రభావం కనిపించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట గాలి వేగం కూడా ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో వ‌ర్షాలు.. 

ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు ప‌లు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా మహారాష్ట్రలో కూడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈశాన్య భారతదేశంలోని బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కొంత మోస్తరు పొగమంచు ఉండే అవకాశం ఉంది.

ఢిల్లీలో త‌గ్గుతున్న‌ ఉష్ణోగ్రతలు.. 

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. చలి తీవ్ర‌త క్ర‌మంగా పెరుగుతోంది. ఢిల్లీలో గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోయింది. ఇక్కడ ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 21గా, కనిష్ట ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలుగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో చ‌లిగాలుల‌ కష్టాలు తప్పవని స్పష్టమవుతోంది.

హైద‌రాబాద్ లో పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌..

తెలంగాణ రాజధాని నగరం హైద‌రాబాద్ చలిగాలులతో వణికిపోయే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో అల్పపీడనం కార‌ణంగా వ‌ర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌డుతాయ‌ని పేర్కొంది. 

click me!