మేకిన్ ఇండియానే లక్ష్యం: ఏసీల దిగుమతులపై భారత్ నిషేధం

By Siva KodatiFirst Published Oct 16, 2020, 3:02 PM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది తమ పెట్టుబడులను దేశీయ తయారీపై పెట్టారు. 

ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది తమ పెట్టుబడులను దేశీయ తయారీపై పెట్టారు. తాజాగా ఈ విధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

ఇప్పటికే వివిధ కలర్‌ టీవీలను ఇతర దేశాలను నుంచి దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించిన భారత్‌.. తాజాగా ఏసీల దిగుమతిపై కూడా నిషేధం విధించింది. దేశీయ తయారీని ప్రోత్సహించడం ద్వారా  స్వావలంబన సాధించడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  

ఈ నిషేధానికి సంబంధించి విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వదేశీ తయారీ విధానానికే ప్రాధాన్యత ఇవ్వాలని గత ఏడాది ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి అత్యవసరమైన వాటినే తప్ప మిగతావాటి దిగుమతిని భారత్‌ తగ్గించుకుంటూ వస్తోంది. గతంలో స్వావలంబన గురించి ప్రధాని మాట్లాడినప్పుడు కూడా ఏసీల దిగుమతి అంశాన్ని ప్రస్తావించారు.

దాదాపు 30 శాతం ఏసీలను భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా దీనిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు. ప్రభుత్వపరంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తాజా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గత జూన్‌లో ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో మోడీ స్వదేశీ తయారీ విధానాన్ని మరోసారి ప్రస్తావించగా ఆ తర్వాతి నెలలోనే విదేశాల నుంచి వివిధ రకాల కలర్‌ టీవీల దిగుమతిపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  

click me!