సీఏఏ అమలును నిలిపివేయాలని కోరుతూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము సీఏఏ అమలుకు వ్యతిరేకం కాదని, కానీ భవిషత్తులో దీని వల్ల ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), రూల్స్-2024 అమలును నిలిపివేయాలని కోరుతూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6బీ (పౌరసత్వ సవరణ) చట్టం 2019 ప్రకారం పౌరసత్వ హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులను ప్రభుత్వం విచారణకు స్వీకరించరాదని ఒవైసీ స్పష్టం చేశారు.
సీఏఏను ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్), ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)తో కలిపి చూడాలని ఒవైసీ పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇవ్వడానికి తాను వ్యతిరేకం కాదని తెలిపారు. ‘‘ఈ చట్టాన్ని చేయడానికి కారణం ఉంది. ఒక వేళ భవిష్యత్తులో మీరు (ప్రభుత్వం) దేశంలో ఎన్పీఆర్, ఎన్ఆర్సీ చేసినప్పుడు భారతదేశంలోని 17 కోట్ల మంది ముస్లింలను నిరాశ్రయులను చేయాలనుకుంటున్నారు.’’ అని తెలిపారు.
undefined
హైదరాబాద్ ప్రజలు సీఏఏకు వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని ఒవైసీ అన్నారు. కాగా.. 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని వేగవంతం చేయడానికి సీఏఏను కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చింది.
ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అయితే నాలుగు సంవత్సరాల తరువాత కేంద్రం మార్చి 11న దానిని నోటిఫై చేసింది. దీంతో ఆ చట్టం గత సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఓ వెబ్ సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.