
గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ ఒక దళిత ఐఏఎస్ హత్య కేసులో దోషిగా నిర్దారించబడి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా ఆనంద్ మోహన్ విడుదలకు బీహార్‌లోని నితీశ్ కుమార్ సర్కార్ మార్గం సుగమం చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఐఏఎస్ అధికారిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలకు జైలు మాన్యువల్ మార్గాన్ని సుగమం చేస్తూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండియన్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (సెంట్రల్) అసోసియేషన్ స్పందించింది. ఇది ‘‘న్యాయాన్ని తిరస్కరించడం’’ అని పేర్కొంది, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.
‘‘ఖైదీల వర్గీకరణ నిబంధనలను మార్చడం ద్వారా గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఐఏఎస్ జి కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన దోషులను విడుదల చేయాలనే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల సెంట్రల్ ఐఎఎస్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. డ్యూటీలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన నేరారోపణలో దోషిని తక్కువ క్రూరమైన వర్గంలోకి తిరిగి వర్గీకరించలేం. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషి విడుదలకు దారితీసే ప్రస్తుత వర్గీకరణను సవరించడం న్యాయాన్ని తిరస్కరించినట్లే’’ అని ఐఏఎస్ అసోసియేషన్ పేర్కొంది.
‘‘ఇటువంటి పలుచన శిక్ష నుంచి మినహాయింపుకు దారితీస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల నైతికతను దెబ్బతిస్తోంది. పబ్లిక్ ఆర్డర్‌ను బలహీనపరుస్తుంది. న్యాయ నిర్వహణను అపహాస్యం చేస్తుంది’’ అని ఐఏఎస్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వీలైనంత త్వరగా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని అసోసియేషన్ బీహార్ ప్రభుత్వాన్ని కోరింది.
ఇక, బీహార్ ప్రభుత్వం నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటీవల ప్రిజన్ మాన్యువల్- 2012ను సవరించింది. ఈ క్రమంలోనే ఐఏఎస్ కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆనంద్ మోహన్‌తో పాటు మరో 26 మందిని విడుదలకు మార్గం సుగమం చేసింది.
ఇక, 29 ఏళ్ల క్రితం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేసిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను ఆయన వాహనం ముజఫర్‌పూర్ జిల్లా గుండా వెళుతుండగా ఒక గుంపు కొట్టి చంపింది. అప్పుడేం జరిగిందంటే.. 1994లో లాలుప్రసాద్ యాదవ్ హయాంలో బిహార్‌లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్ బిహారీ ప్రసాద్ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్ మోహన్ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్యను కారులో నుంచి బయటికి లాగి రాళ్లతో కొట్టి హత్య చేశారు.