Agnipath: అగ్నిపథ్ స్కీం కింద రికార్డు స్థాయిలో అప్లికేషన్లు.. ఎయిర్‌ఫోర్స్‌కు పోటెత్తిన దరఖాస్తులు

Published : Jul 06, 2022, 02:06 PM IST
Agnipath: అగ్నిపథ్ స్కీం కింద రికార్డు స్థాయిలో అప్లికేషన్లు.. ఎయిర్‌ఫోర్స్‌కు పోటెత్తిన దరఖాస్తులు

సారాంశం

అగ్నిపథ్ స్కీం కింద ఊహించిన స్థాయిలో భారత వైమానిక దళం జారీ చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తులు వచ్చాయి. ఐఏఎఫ్ చరిత్రలో చూడనన్ని దరఖాస్తులు అగ్నిపథ్ స్కీం కింద వచ్చాయని ట్వీట్ చేసింది. మంగళవారం నాటికి సుమారు 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి.  

న్యూఢిల్లీ: భద్రతా బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీంను తెచ్చిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పదవీ కాలంతో షార్ట్ టర్మ్ సర్వీస్‌లకు ఈ పథకంతో కేంద్రం తెరలేపింది. ఆర్మీలో యువతను ఎక్కువగా తీసుకోవడానికి ఈ పథకం వెనుక ప్రధాన లక్ష్యం అని వివరించింది. కానీ, ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఆందోళనలు జరిగాయి. తెలంగాణ, బిహార్ వంటి రాష్ట్రాల్లోనైతే ఆ ఆందోళనలు హింసాత్మకం అయినవి కూడా. కానీ, కేంద్రం వెనక్కి తీసుకోలేదు. ఈ విషయాన్ని భద్రతా విభాగాలకు చెందిన చీఫ్‌లు కూడా స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీంతో మేలేనని, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన స్కీం అని వివరించారు. దీన్ని ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తీసుకునే అవకాశమే లేదని స్పష్టీకరించారు.

కేంద్రం అగ్నిపథ్ స్కీం ప్రకటించిన 10 రోజులకు భారత వైమానిక దళం అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఈ నోటిఫికేషన్‌కు పెద్దగా ఆదరణ ఉండబోదనే వాదనలు వచ్చాయి. కానీ, ఈ నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులు చూస్తే మాత్రం ఆ అంచనాలు తప్పు అని తేలిపోతుంది. అగ్నిపథ్ స్కీం కింద భారత వైమానిక దళానికి సుమారు 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు భారత వైమానిక దళానికి వచ్చిన అత్యధిక అప్లికేషన్లు ఇవే కావడం గమనార్హం. ఈ మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఓ ట్వీట్ చేసింది. 

అగ్నిపథ్ స్కీం కింద ఐఏఎఫ్‌లో రిక్రూట్‌మెంట్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తుల గడువు ముగిసిందని ఆ ట్వీట్ పేర్కొంది. గతంలో భారత వైమానిక దళంలో ఉద్యోగ నోటిఫికేషన్‌కు గరిష్టంగా 6,31,528 అప్లికేషన్లు వచ్చాయని వివరించింది. కానీ, అగ్నిపథ్ స్కీం కింద మరే సైకిల్‌లోనూ రాలేనన్ని దరఖాస్తులు వచ్చాయని, ఐఏఎఫ్ చరిత్రలోనే అత్యధికంగా 7,49,899 అప్లికేషన్లు వచ్చాయని వివరించింది.

అగ్నిపథ్ స్కీం కింద ఐఏఎఫ్ జూన్ 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారంతో ఈ నోటిఫికేషన్‌కు ఉద్యోగ దరఖాస్తు గడువు ముగిసింది.

దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ.. దరఖాస్తులు మాత్రం ఊహించని స్థాయిలో వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu