షారుఖ్ ఖాన్ ఫోన్ చేసిన తర్వాత కూడా.. ఆయనెవరో నాకు తెలియదు: అసోం సీఎం హిమంత శర్మ పునరుద్ఘాటన

By Mahesh KFirst Published Jan 23, 2023, 7:19 PM IST
Highlights

షారుఖ్ ఖాన్ ఎవరో తనకు తెలియదని అసోం సీఎం హిమంత శర్మ మరోసారి పేర్కొన్నారు. మొన్న ఇదే వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటి రోజే షారుఖ్ ఖాన్.. అసోంలో తన మూవీ వివాదానికి సంబంధించి మాట్లాడటానికి హిమంతను కాంటాక్ట్ అయ్యారు. మెస్సేజీ చేశారు. ఆ తర్వాత ఫోన్ కాల్‌లో మాట్లాడారు. షారుఖ్  ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పటికీ మళ్లీ ఆయనెవరో తనకు తెలియదని హిమంత పేర్కొనడం గమనార్హం.
 

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఫోన్ చేసిన తర్వాత కూడా అసోం సీఎం హిమంత శర్మ ఆయనెవరో తనకు తెలియదని పునరుద్ఘాటించారు. 2001 తర్వాత తాను పెద్దగా సినిమాలు చూడలేదని అన్నారు. తనకు షారుఖ్ ఖాన్ ఎవరో తెలియదని హిమంత శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిపోయింది. ఈ కామెంట్ చేసిన గంటల వ్యవధిలోనే షారుఖ్ ఖాన్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడటానికి ముందు ఓ మెస్సేజీ పంపారు. ఫోన్‌లో మాట్లాడిన తర్వాత కూడా తాజాగా హిమంత శర్మ ఆయనెవరో తనకు తెలియదని పేర్కొనడం గమనార్హం.

పఠాన్ మూవీలో బేషరమ్ రంగ్ అనే పాట వివాదానికి తెర లేపింది. పలు రైట్ వింగ్ ఔట్‌ఫిట్స్ ఈ పాట తమ మతపరమైన భావోద్వేగాలను గాయపరుస్తున్నదని ఆందోళనలు చేశాయి. అంతేకాదు, పఠాన్ మూవీని బాయ్ కాట్ చేస్తామని పిలుపు ఇచ్చాయి. ఈ తరుణంలోనే అసోంలోనూ పఠాన్ మూవీ పోస్టర్లను ఓ చోట చింపేశారు. ఈ సినిమా బుధవారం విడుదల కావాల్సి ఉన్నది. ఈ ఆందోళనల నేపథ్యంలో షారుఖ్ ఖాన్ అసోం సీఎం హిమంత శర్మకు ఫోన్ చేశారు.

Also Read: పఠాన్ సినిమాపై ఆందోళనలు:అసోం సీఎం బిశ్వశర్మకు బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఫోన్

హిమంత్ శర్మ మాట్లాడుతూ శనివారం సాయంత్రం నాకు ఎస్ఆర్‌కే నుంచి తనకు మెస్సేజీ వచ్చిందని వివరించారు.‘ఆ రోజు సాయంత్రం 7.15 గంటలకు ఎస్‌ఆర్‌కే నుంచి టెక్స్ట్ మెస్సేజీ వచ్చింది. తనను తాను పరిచయం చేసుకుంది. ‘‘నేను షారుఖ్ ఖాన్, మీతో మాట్లాడాలని అనుకుంటున్నా’’ అని అన్నాడు. అతనికి నేను మెస్సేజీ చేశాను. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆయనే నాకు పరిచయం చేసుకున్నాడు. నాకు అతనెవరో తెలియదు. నాకు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర తెలుసు, కానీ, షారుఖ్ ఖాన్ తెలియదు. 2001 తర్వాత నేను పెద్దగా సినిమాలు చూడలేదు’ అని అన్నారు.

‘రాత్రి 2 గంటలకు నేను ఫోన్ చేశాను. మేం మాట్లాడుకున్నాం. అసోంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని నేను అతనికి చెప్పాను’

అసోంలో పఠాన్ మూవీ స్క్రీనింగ్ జరుగుతుండగా కొందరు రైట్ వింగ్ యాక్టివిస్టులు మూవీ పోస్టర్ ను చింపేశారు. ఈ ఘటన నేపథ్యంలో షారుఖ్ ఖాన్ హిమంత శర్మకు ఫోన్ చేశారు. 

ఎస్‌ఆర్‌కే ఎవరో తనకు తెలియదని, పఠాన్ సినిమా కూడా తనకు తెలియదని హిమంత శర్మ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే షారుఖ్ ఖాన్ హిమంతకు టెక్స్ట్ చేశారు.

click me!