14 ఏళ్ల లోపు అమ్మాయిలను పెళ్లి చేసుకునే వారిపై పోక్సో చట్టం కింద కేసులు..

By Mahesh RajamoniFirst Published Jan 23, 2023, 6:56 PM IST
Highlights

Dispur:14 ఏళ్ల లోపు అమ్మాయిలను పెళ్లి చేసుకునే వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వచ్చే 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారీ ఆపరేషన్ చేపడతామని ప్రకటించారు.
 

Assam Chief Minister Himanta Biswa Sarma: అస్సాంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టనుందనీ, 14 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకునే పురుషులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ క‌ల్పించే చట్టం పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రకటించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లౌకిక, తటస్థ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 14-18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 కింద విచారణ జరిపి, ఈ చట్టం ప్రకారం వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. బాల్య వివాహాల‌ను అరిక‌ట్ట‌డానికి అస్సాం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే భారీ ఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ ను చేప‌ట్ట‌నుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. అలాగే, బాల్య వివాహాల్లో భాగ‌మైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. 14 ఏళ్ల లోపు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని దిస్పూర్ లోని జనతా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ‌ తెలిపారు. మరో 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆపరేషన్ చేపడతామని కూడా ఆయ‌న ప్రకటించారు. అలాగే, బాలిక‌ల అణ‌చివేత చ‌ర్య‌ల‌ను అడ్డుకుంటామ‌నీ, వీలైనంత ఎక్కువ మంది దోషులను జైలుకు పంపాలని తాను అస్సాం పోలీసులను ఆదేశిస్తున్నాని చెప్పారు. 

Latest Videos

'డిపార్ట్ మెంట్ కమ్యూనిటీ యాక్షన్ తీసుకుంటుంది. మేము చట్టపరమైన నిబంధనల గురించి మాట్లాడుతున్నాము. చట్టపరంగా 2006లో పార్లమెంటు ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. బాల్యవివాహ నిషేధ అధికారిని నియమించాలనీ, తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని పార్లమెంట్ కోరిందని" ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ తెలిపారు. ఆరేళ్లుగా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశారనీ, తమ పాలనలో దీనికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఐదేళ్లలో మన రాష్ట్రాన్ని బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. దిబ్రూగఢ్ జిల్లాలో 23 శాతం మంది బాలికలకు నిషేధిత వయసులోనే వివాహాలు జరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా సీఎం అధికారిక గణాంకాలను ఉటంకించారు.

 

Live: Addressing press conference at CM's block, Janata Bhawan, Dispur https://t.co/ecnLlkCKkr

అలాగే, బాల్య వివాహాల అంశానికి రాజకీయ రంగు పూయడం తనకు ఇష్టం లేదని, ఏదో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నామనే భావనను ఇవ్వదలచుకోలేదన్నారు. అస్సాం అంతటా ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బాల్యవివాహాల నిషేధ అధికారిని నియమించిన కర్ణాటక ప్రభుత్వాన్ని తాను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పారు. ఇప్పటి వరకు 11 వేల బాల్య వివాహాలను నిరోధించామని తెలిపారు. కేసులు నమోదు చేయడమే కాకుండా ఈ కేసులను నిరోధించడానికి ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా బాల్యవివాహ నిషేధ అధికారిపై ఉందని సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌ పేర్కొన్నారు.

click me!