
బెంగళూరు : చిత్రదుర్గ జిల్లాలో 17 ఏళ్ల బాలికపై భర్త, ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడాది క్రితం బాలికను బెదిరించి ఇర్ఫాన్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి ఆ బాలిక శీలాన్ని శంకిస్తూ, వేదిస్తూ ఉండేవాడు. జూన్ 7న చిత్రదుర్గ శివార్లకు తన వెంట తీసుకు వెళ్ళాడు. ముందుగానే స్నేహితులను అక్కడికి పిలిపించాడు. ఆ తర్వాత మూకుమ్మడిగా బాలికపై దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలు తనలో తానే ఇన్నిరోజులు కుమిలిపోతూ వచ్చింది. బంధువులు విషయం తెలుసుకుని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో, ఇర్ఫాన్ తో పాటు మరొకరిని మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా మైసూరు వరుణ వద్ద చట్టన హళ్ళి గ్రామంలో పుట్టమ్మ(40) అనే మహిళను భర్త దేవరాజు హత్య చేశాడు. 21 ఏళ్ల కిందట వీరికి పెళ్లయింది. వీరికి 20 ఏళ్ల కూతురు ఉంది. భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్యను కత్తితో గొంతుకోసి చంపి తల, మొండెం వేరు చేసి పరారయ్యాడు. ఇతడు మొదటి భార్య పై కూడా గతంలో హత్యాయత్నానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు దేవరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చిన్నారిని చాకచక్యంగా కాపాడిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్.. పోలీసులు సలాం కొడుతున్న నెటిజన్లు..
ఇదిలా ఉండగా, నెల్లూరు జిల్లాలో జూన్ 24న ఇలాంటి దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. తన భర్తను తాగుడుకు బానిస అయ్యేలా చేయడంతోపాటు.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే తామిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. ఓ లేఖ కూడా రాశారు.
పోలీసుల కథనం ప్రకారం… ‘నా చావుకు, నా భర్త చావు కారణం షేక్ ఇలియాజ్.. నా భర్తను తాగుడికి బానిస అయ్యేలా చేశాడు. ఆయన ద్వారా నాకు మత్తు మందు ఇచ్చి సృహ తప్పి పడిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మేము ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తర్వాత అయినా అతనికి శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం’ అని బాధితురాలు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది.
ఆ తర్వాత దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. నిందుతుడు వారిని ఎలా బ్లాక్ మెయిల్ చేసిందీ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.