
లక్నో : ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాదులో ఓ చిన్న ఘటన విషయంలో చెలరేగిన వివాదం ఇద్దరి ప్రాణాలను తీసింది. భార్యను చంపబోయి భర్త కూడా చనిపోయాడు. భార్యను తుపాకీతో కాల్చిన భర్త.. అదే తూటాకు తాను బలైపోయాడు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. బిలారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో అనేక్ పాల్ అనే వ్యక్తి కుటుంబంతో జీవిస్తున్నాడు. అతను దినసరి కూలీ. పాల్ కు పెళ్లయింది.. భార్య సుమన్, నలుగురు పిల్లలు ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం భార్య సుమన్ తన దగ్గర ఉన్న ఫోన్ ను పోగొట్టింది. ఈ విషయం మీదే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం కూడా ఇంట్లో పూజ ముగిసిన తర్వాత మరోసారి ఫోన్ గురించి గొడవపడ్డాడు భార్యతో. ఈ క్రమంలో తీవ్రమైన కోపానికి వచ్చిన పాల్ సహనం కోల్పోయి.. భార్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో ఆమె వీపు మీద కాల్చాడు.
62 ఏళ్ల వయస్సులో తండ్రయ్యాడు.. ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చిన రెండో భార్య..
ఆ బుల్లెట్ ఆమె ఛాతి నుంచి బయటికి దూసుకు వచ్చి.. ఆమెను కౌగిలించుకున్న పాల్ కు తగిలింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ కాల్పుల శబ్దం చుట్టుపక్కల వారు విన్నారు. వెంటనే అనేక్ పాల్ ఇంటికి వచ్చారు. అక్కడ పరిస్థితిని చూసి.. భార్యాభర్తలిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి వారిద్దరూ అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.
దీనిమీద పోలీసులకు సమాచారం అందడంతో.. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో నలుగురు పిల్లలు అనాధలుగా మారారు. ఆ నలుగురు పిల్లలను పోలీసులు సంరక్షణ ఆలయానికి తరలించారు.