Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్‌పై 193 గంటలు జీవించగలదు.. మనిషి చర్మంపై ఎన్ని గంటలంటే?

Published : Jan 26, 2022, 08:41 PM IST
Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్‌పై 193 గంటలు జీవించగలదు.. మనిషి చర్మంపై ఎన్ని గంటలంటే?

సారాంశం

వుహాన్‌లో వెలుగుచూసిన ఒరిజిన్ కరోనావైరస్ స్ట్రెయిన్, ఇతర వేరియంట్లు బయట వాతావరణంలో ఎంత సేపు జీవించి ఉండగలుగుతున్నాయని జపాన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. దాని ప్రకారం, ఒరిజినల్ స్ట్రెయిన్ కంటే మిగతా వేరియంట్లు ఎక్కువ కాలం బయట మనగలుగుతున్నాయి. ముఖ్యంగా అన్ని వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ కాలం బయట జీవించి ఉండగలిగే శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నదని తేలింది. బహుశా అందుకే ఆ వేరియంట్ మిగతా వాటికంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండవచ్చని ఆ పరిశోధకులు భావిస్తున్నారు.  

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) దేశంలో దాని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ వేరియంట్ కారణంగానే మన దేశంలో థర్డ్ వేవ్ వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నదనీ వెల్లడించారు. అంతేకాదు, మనిషి సహజ రోగనిరోధక శక్తిని, వ్యాక్సిన్ ప్రేరేపించే యాంటీబాడీల నుంచి ఎస్కేప్ అయ్యే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉన్నదనీ వివరించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఫస్ట్ వుహాన్‌లో వెలుగుచూసిన కరోనావైరస్‌కు అనేకమార్లు ఉత్పరివర్తనాలు చెందిన ప్రస్తుత భిన్న వేరియంట్లకు మధ్య ఉన్న తారతమ్యాన్ని కనుగొనడానికి జపాన్‌కు చెందిన క్యోటో ప్రిఫెక్చరల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు.

నిజంగా తొలిసారి వుహాన్‌లో వెలుగుచూసిన కరనా వైరస్ కంటే కూడా ఆ తర్వాత వచ్చిన ఆల్ఫా, బీటా, డెల్టా(Delta Variant), ఒమిక్రాన్ వేరియంట్‌లు బయటి పర్యావరణంలో ఎక్కువ కాలం జీవించగలుగుతున్నాయని(Alive) ఆ పరిశోధన వెల్లడించింది. ఏకంగా రెండు రెట్లు ఎక్కువ కాలం మనుగడ సాధించగలుగుతున్నాయని తెలిపింది. ఇలా బయట వాతావరణంలో ఎక్కువ కాలం వైరస్ జీవించ గలిగే శక్తి సంపాదించుకుంటే.. అంత వేగంగా అది వ్యాపించే సామర్థ్యాన్ని పొందినట్టేనని పరిశోధకులు చెప్పారు. ఇదే పరిశోధనలో మిగతా అన్ని వేరియంట్ల కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ కాలం బయటి పర్యావరణంలో జీవించగలిగి ఉండే శక్తిని కలిగి ఉన్నదని వివరించారు.

ప్లాస్టిక్ ఉపరితలంపై కరోనావైరస్ ఒరిజినల్ వర్షన్, మిగతా వేరియంట్లు అంటే.. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఎంతకాలం మనగలుగుతున్నాయనే విషయాన్ని వారు నిర్ధారించారు. ఈ పరిశోధన ప్రకారం, ఒరిజిన్ స్ట్రెయిన్ ప్లాస్టిక్ పై 56 గంటలు జీవించగలదు. అలాగే, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లు వరుసగా 191.3 గంటలు, 156.6 గంటలు, 59.3 గంటలు, 114 గంటలు ప్లాస్టిక్ ఉపరితలంపై జీవించగలుగుతున్నాయని పరిశోధన వెల్లడించింది. కాగా, వీటన్నింటి కంటే గరిష్టంగా ఒమిక్రాన్ వేరియంట్ 193.5 గంటలు జీవించగలదని తెలిపింది.

కాగా, మానవ శరీరంపై అంటే చర్మం(Skin)పై వుహాన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్ సగటును 8.6 గంటలు జీవించి ఉండగలదు. అంటే.. ఇంతలోపు అది మన బాడీలోకి వెళ్లితే మనం దాని బారిన పడతాం అన్నమాట. ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా వేరియంట్ 19.1 గంటలు, గామా వేరియంట్ 11 గంటలు, డెల్టా వేరియంట్ 16.8 గంటలు, ఒమిక్రాన్ వేరియంట్ 21.1 గంటలు జీవించి ఉండగలవని ఈ జపాన్ వర్సిటీ పరిశోధన వెల్లడించింది.

ఇదిలా ఉండగా, మనదేశంలో గ‌త 24 గంట‌ల్లో క‌రోనా కొత్త మ‌ర‌ణాల మ‌రింత‌గా పెరిగాయి. కొత్త‌గా 2.85 ల‌క్ష‌ల కోవిడ్-19 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 665 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే కోవిడ్ కేసులు, మ‌ర‌ణాలు 11 శాతానికి పైగా పెరిగాయి. దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు (India's recovery rate) 93.23 శాతంగా ఉంది. క‌రోనా మ‌ర‌ణాల రేటు 1.23 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,00,85,116 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 4,91,127 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ప్ర‌స్తుతం మ‌హ‌రాష్ట్ర, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?