Donald Trump భారత్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

By Rajesh KFirst Published Aug 19, 2022, 7:10 AM IST
Highlights

Trump India Visit: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు భారత ప్రభుత్వం రూ.38 లక్షలు ఖర్చుచేసినట్టు RTI కార్యకర్త దరఖాస్తుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది.

Trump India Visit: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు భారత ప్రభుత్వం రూ.38 లక్షలు ఖర్చుచేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఆయ‌న 2020 ఫిబ్రవరి 24-25  తేదీలలో భార‌త్ లో సంద‌ర్శించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 36 గంటల రాష్ట్ర పర్యటన సందర్భంగా వసతి, ఆహారం, లాజిస్టిక్స్ తదితరాల కోసం కేంద్రం దాదాపు రూ. 38 లక్షలు ఖర్చు చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర సమాచార కమిషన్‌కు తెలిపింది.

2020లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారతదేశ‌ పర్యటనకు వచ్చారు. ఆయన వెంట భార్య మెలానియా, కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రెండు రోజుల పర్య‌ట‌నలో భాగంగా వారు అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీలను సంద‌ర్శించారు.

ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో మూడు గంటలు గడిపారని, ఈ సందర్భంగా 22 కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారని ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. అలాగే ట్రంప్ ఫ్యామిలీ సబర్మతీ ఆశ్రమాన్ని సంద‌ర్శించి..  మహాత్మా గాంధీకి నివాళులర్పించింది. అనంత‌రం మోటేరా క్రికెట్ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి "నమస్తే ట్రంప్" అనే భారీ సభలో పాల్గొని.. అక్క‌డ‌ ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్ అదే రోజు తాజ్ మహల్ చూడటానికి ఆగ్రాకు వెళ్ళారు, 
 
మ‌రుస‌టి రోజు ఫిబ్రవరి 25 న ట్రంప్ ఫ్యామిలీ దేశ రాజధాని ఢిల్లీలో పర్య‌టించింది. ప‌లు చారిత్ర‌క ప్ర‌దేశాల సందర్శ‌న అనంత‌రం.. ట్రంప్  PM నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపాడు. ఫిబ్రవరి 2020లో అమెరికా ప్రెసిడెంట్, ప్రథమ మహిళ పర్యటన సందర్భంగా ఆహారం, భద్రత, వసతి, విమానాల కోసం భారత ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు ఎంత అని మిషాల్ భటేనా అనే వ్యక్తి RTI ద్వారా  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అడిగారు.  

మిషాల్ భటేనా మొదటి RTIని అక్టోబర్ 24, 2020న దాఖలు చేశారు, కానీ, దానికి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఆ తర్వాత ఆర్టీఐ వ్యవహారాల్లో అత్యున్నత అప్పీలేట్ అథారిటీ అయిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌ను ఆశ్రయించారు. విదేశాంగ శాఖ వివరణను పరిశీలించిన తర్వాత ప్రధాన సమాచార కమిషనర్ వైకె సిన్హా మాట్లాడుతూ.. సమాధానాన్ని సంతృప్తికరంగా అందించడంలో జాప్యానికి గల కారణాలను మంత్రిత్వ శాఖ వివరించింది అన్నారు.

అదే సమయంలో ప్రత్యుత్తరం ఆలస్యం అయినందుకు కరోనాను ఉటంకిస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 4న కమిషన్‌కు ప్రత్యుత్తరం ఇచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్ భారతదేశ పర్యటనకు సంబంధించి భారత ప్రభుత్వం వసతి, భోజనం, లాజిస్టిక్స్‌పై కొన్ని ఖర్చులను భార‌త ప్ర‌భుత్వ‌మే భరించింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న వ్యయం సుమారు రూ.38,00,000 లు ఖ‌ర్చు చేసిన‌ట్టు   తెలిపింది.  విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాధానంలో.. ఇత‌ర దేశాల‌కు చెందిన‌  అగ్ర నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల రాకపై ఆతిథ్య దేశాలు ఖర్చు చేసే ఖర్చులు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జరుగుతాయని తెలిపింది.

click me!