పదేళ్లుగా పిల్లలకోసం పరితపించిన జవాన్, తీరా పుట్టే సమయానికి మృత్యుఒడికి

By Nagaraju TFirst Published Oct 23, 2018, 10:15 PM IST
Highlights

తన రక్తం పంచుకుపుట్టిన పిల్లల కోసం ఆ జవాన్ పరితపించాడు. పదేళ్లుగా ఆ అదృష్టం కోసం వేచి చూస్తున్నాడు. పిల్లల కోసం ఆ దంపతులు మెుక్కని దేవుడు లేడంటే అతిశయోక్తి కాదు. దేవుడు కరుణించాడు. భార్య గర్భవతి అయ్యింది. భార్యను పురుడు కోసం పుట్టింటికి పంపించాడు. 

జమ్మూకశ్మీర్: తన రక్తం పంచుకుపుట్టిన పిల్లల కోసం ఆ జవాన్ పరితపించాడు. పదేళ్లుగా ఆ అదృష్టం కోసం వేచి చూస్తున్నాడు. పిల్లల కోసం ఆ దంపతులు మెుక్కని దేవుడు లేడంటే అతిశయోక్తి కాదు. దేవుడు కరుణించాడు. భార్య గర్భవతి అయ్యింది. భార్యను పురుడు కోసం పుట్టింటికి పంపించాడు. తన వారసుడు వస్తాడంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు ఆ జవాన్. పుట్టకుండానే బిడ్డకోసం ఒక ఊహా ప్రపంచాన్నే సృష్టించుకున్నాడు. 

ఇంతలో ఘోరం జరిగింది. 10ఏళ్లుగా ఎదురు చూస్తున్న తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డను చూడకుండానే కన్ను మూశాడు. పాకిస్థాన్ చొరబాటు దారులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ఆదివారం రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ చొరబాటు దారుల కాల్పులకు తెగబడ్డారు. 

ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జవాన్ రంజీత్ సింగ్ భూత్యాల్ పోరాడి వీర మరణం పొందారు. రంజీత్ సింగ్ భూత్యాల్ తోపాటు మరో ఇద్దరు భారత సైనికులు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. అయితే ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాకిస్తాన్ చొరబాటు దారులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 

రంజీత్ సింగ్ భూత్యాల్ ఆదివారం మృతిచెందగా అతని భార్య మంగళవారం ఉదయం తెల్లవారుజామున పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పదేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డను చూడకుండానే దేశం కోసం తన రక్తం చిందించాడని బంధువులు వాపోతున్నారు. బిడ్డను చూడకుండానే చనిపోయాడంటూ కన్నీరమున్నీరవుతున్నారు. 

మరోవైపు రంజీత్ సింగ్ భూత్యాల్ మృతదేహాన్ని తన సొంతూరుకు తరలించారు. అయితే భర్త మృతదేహాన్ని చూసి ఆ భార్య తల్లడిల్లిపోయింది. బోరున విలపించింది. అంత్యక్రియలకు పసిబిడ్డతో వచ్చి చూడకుండానే వెళ్లిపోయావా అంటూ ఆమె విలపించిన తీరు అందర్నీ కంటతడిపెట్టించింది. అధికారిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

2003లో రంజీత్ సింగ్ భారత సైన్యంలో చేరాడు. తన భార్య ప్రసవం కోసం సెలవులు తీసుకుంటానని ఇటీవలే తోటి ఉద్యోగులతోనూ, బంధువులతోనూ చెప్పాడు. ఇంతలోనే ఇలా దారుణం చోటు చేసుకుందని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవు తీసుకుంటే బతికేవాడని కన్నీరుమున్నీరవుతున్నారు. 

అయితే వీరజవాన్ భార్య మాత్రం తన కూతురును కూడా ఆమె తండ్రిలానే పెంచుతానని చెప్తున్నారు. తన కుమార్తెను కూడా దేశ రక్షణ కోసం పెంచుతానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అమృతగడియలు వచ్చినా కడ చూపు కూడా చూడకుండా జవాన్ వీర మరణం పొందడం బాధాకరం. ఇదేనేమో విధిరాత అంటే. 

click me!