ఓ మహిళ 14 ఏళ్ల బాలికతో అమానుషంగా ప్రవర్తించింది. మూడో అంతస్తు నుంచి నెట్టేసింది. దీంతో బాధితురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గిన్నెకు కాలు తగిలిందని ఓ మహిళ 14 ఏళ్ల బాలిక పట్ల దారుణానికి పాల్పడింది. మూడో అంతస్తు నుంచి ఆ బాలికను కిందకు నెట్టేసింది. దీంతో బాలికకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. సైన్ విహార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో 14 ఏళ్ల బాలిక ఏళ్ల బాలిక తన సోదరుడు, తల్లిదండ్రులతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరు ఉండే గది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. అదే ఇంట్లో థర్డ్ ఫ్లోర్ లో 35 ఏళ్ల రేణు దేవి అనే మహిళ కూడా అద్దెకు ఉంటోంది. కాగా.. బుధవారం సాయంత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే 14 ఏళ్ల బాలిక.. ఏడేళ్ల తన మేనకోడలతో కలిసి మొక్కలకు నీరు పెట్టేందుకు టెర్రస్‌పైకి వెళ్తోంది.
అదే సమయంలో రేణు దేవి వంటగది పాత్రలను బాల్కనీలో మధ్యలో ఉంచింది. టెర్రస్ పైకి వెళ్లే సమయంలో ఆ బాలిక అనుకోకుండా అందులో ఉన్న ఓ గిన్నెను తాకింది. దీంతో ఆ మహిళకు కోపం వచ్చింది. ఆ బాలికలిద్దరిని దుర్భాషలాడింది. వారిని కొట్టడానికి కూడా ప్రయత్నించింది. పిల్లలు అభ్యంతరం తెలిపారు. దీంతో మరింత కోపం తెచ్చుకుని 14 ఏళ్ల బాలికను మూడో అంతస్తు నుంచి నెట్టేసింది.
ఆ బాలిక పై నుంచి కింద ఉన్న టైల్స్ వేసి ఉన్న రోడ్డుపై పడింది. స్థానికులు గమనించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి పళ్లు, దవడ విరగడంతో పాటు కాలికి పగుళ్లు వచ్చాయని తెలిపారు. చేతులు, నడుముకు కూడా గాయాలయ్యాయి. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.