
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. కొత్తగా ముఖ్య అర్థిక జోత్యిష్కుడిని నియమించుకోవాలని ఆయన సూచించారు. నాసా కొత్తగా విడుదల చేసిన విశ్వం లోతైన రూపాన్ని ప్రదర్శించే టెలిస్కోప్‌కు సంబంధించిన కొన్ని ట్వీట్‌లను నిర్మలా సీతారామన్ రీట్వీట్ చేశారు. దీనిపై చిదంబరం స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన సొంత నైపుణ్యాలు, తన ఆర్థిక సలహాదారులపై ఆశలు వదులుకున్నారని అన్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి గ్రహాలను పిలిచారని తీవ్రంగా విమర్శించారు.
‘‘ ద్రవ్యోల్బణం 7.01 శాతం, నిరుద్యోగం 7.8 శాతంగా నమోదైన రోజున ఆర్థిక మంత్రి సీతారామన్ బృహస్పతి, ప్లూటో, యురేనస్ చిత్రాలను ట్వీట్ చేయడం మాకు ఆశ్చర్యం కలిగించదు ’’ అని చిదంబరం ట్వీట్ చేశారు. ‘‘ ఆమె తన సొంత నైపుణ్యాలు, ఆర్థిక సలహాదారుల నైపుణ్యాలపై ఆశను వదులుకున్న తరువాత ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి గ్రహాలను పిలిచారు ’’ అని సెటైర్ వేశారు. ఆమె కొత్త చీఫ్ ఎకనామిక్ జ్యోతిష్యుడిని (CEA)ని నియమించుకోవాలని సూచించారు.
కాగా దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ దిశగా నడిపించడం కంటే యురేనస్, ప్లూటోలపై సీతారామన్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ బుధవారం విమర్శించింది.