
Teen thrashed, stripped naked after stealing chips: నెట్టింట ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని ఒక మైనర్ పై దుకాణం యజమాని క్రూరంగా ప్రవర్తించాడు. మైనర్ కళ్లల్లో కారం కొట్టి.. అతని బట్టలు తొలగించి నగ్నంగా మార్చి తీవ్రంగా కొట్టాడు. ఈ హింసకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. మైనర్ పై దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి అధికారులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చిప్స్ ప్యాకెట్ దొంగిలించిన ఒక మైనర్ బాలుడిని ఓ దుకాణదారుడు చితకబాదిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహ్రులోని టిక్కర్ బజార్‌లో జరిగిన ఈ సంఘటనలో శివకుమార్ అనే మైనర్ చిప్స్ ప్యాకెట్ ను దొంగిలించాడు. దీంతో ఆగ్రహించిన నిందితుడు రాహుల్ సోనీ.. బాలుడిని చితకబాది, కళ్లలో కారంపొడి చల్లి, అనంతరం జనం ముందు నగ్నంగా మార్చాడు.
ఈ దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్నవారిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 341, 323, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టంలోని సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అలాగే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని పోలీసులు ప్రజలను సూచించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందనీ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.