రోమ్ తగలబడిపోతుంటే రాజు పిడేలు వాయించినట్లు వుంది హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తీరు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వేళ ఆయన ఆయన అసెంబ్లీలోనే కునుకు తీయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఒకప్పుడు భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. గత దశాబ్దకాలంగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ప్రస్తుతం అతికొన్ని రాష్ట్రాల్లో అధికారంలో వుంది. అయితే అందులోనూ కొన్నిరాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత మూటగడ్డుకుంటోంది. ఇలా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో వున్నారు... సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో మౌళిక సౌకర్యాల అభివృద్ది, నిరుద్యోగ సమస్యపై హామీ ఇచ్చారు. అంతేకాదు అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారుస్తామని హామీ ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావస్తోంది...కానీ అనేక హామీలను ఇంకా నెరవేర్చలేదు. దీంతో ప్రజలకు సుఖు సర్కార్ పై నమ్మకం కోల్పోయారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం చేస్తామన్న హామీని నెరవేర్చకపోవడంతో సీఎం సుఖుపై హిమాచల్ యువత గుర్రుగా వున్నారు. ఎన్నికల కోసమే నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారా? అంటూ నిలదీస్తున్నారు. అలాగే రోడ్ల పరిస్థితిని మెరుగుపరుస్తామన్న హామీ కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. పర్యాటక ప్రాంతాల అభివృద్ది హామీ అలాగే వుంది. ఇలా ఏ హామీని నెరవేర్చకుండా హిమాచల్ ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తోంది సుఖు ప్రభుత్వం.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సీఎంపై గుర్రుగా వున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అసెంబ్లీ సాక్షిగా కునుకుతీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి సుఖు కీలక అంశాలపై చర్చ సమయంలో కునుకుతీయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కునుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.