
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిజాబ్ వద్దు .. కాషాయం వద్దన్న న్యాయస్థానం ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల్లో విద్యార్థులు 'హిజాబ్' ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. దీనిపై సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. అయితే వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏ విద్యార్థి కూడా మతపరమైన దుస్తులు ధరించాలని పట్టుబట్టకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం విచారణను సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది కోర్ట్.
పిటిషన్ల తరఫున సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. కర్ణాటక విద్యా చట్టంలో యూనిఫామ్‌పై ప్రత్యేక నిబంధనలేవీ లేవని తెలిపారు. మునుపటి రోజుల్లో యూనిఫామ్ అనేది పాఠశాలలో ఎక్కువగా ఉండేదని.. కాలేజ్‌లకు యూనిఫామ్ చాలా కాలం తరువాత వచ్చాయని అన్నారు. తాను యూనివర్శిటీలో చదివే రోజులలో యూనిఫామ్ లేదని చెప్పారు. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. విచారణ సందర్భంగా చోటుచేసుకునే మౌఖిక పరిశీలనలను నివేదించవద్దని మీడియాను కోరింది. తుది ఉత్తర్వుల కోసం వేచిచూడాలని తెలిపింది. విచారణ సందర్భంగా చేసే కామెంట్లను సోషల్ మీడియాలో కూడా పెట్టవద్దని పేర్కొంది.
ఇక, హిజాబ్ వివాదంపై హైకోర్టు విచారణ నేపథ్యంలో.. ఎవరూ కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని రాజకీయ నాయకులతో పాటుగా ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కోరారు. విద్యార్థుల పట్ల అత్యంత సంయమనం పాటిస్తూ శాంతిభద్రతలను కాపాడాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించినట్లు కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర గురువారం తెలిపారు.
అంతకుముందు బుధవారం Hijab విషయమై దాఖలైన పిటిషన్‌పై విచారణను విస్తృత ధర్మాసనానికి Karnataka Single Judge రిఫర్ చేసింది. ఈ విషయమై విస్తృత ధర్మాసనం అవసరమని భావిస్తున్నామని జడ్జి క్రిషన్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అయితే గతంలో ఇదే తరహాలో Madras, Kerala హైకోర్టుల్లో తీర్పును సింగిల్ జడ్జి లే ఇచ్చారని న్యాయవాది కాళీశ్వరం రాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులను కూడా విస్తృత బెంచే ఇస్తుందని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు.
హిజాబ్ పై వరుస పిటిషన్లను తప్పుగా భావించబడుతున్నాయని అడ్వకేట్ జనరల్ ఈ పిటిషన్ పై విచారణ సందర్శంగా చెప్పారు. అయితే పిల్లలను వారి విశ్వాసాలను అనుసరించి స్కూల్స్ కు వెళ్లనివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడాన్ని కూడా పిటిషనర్ వ్యతిరేకించారు. ఈ విషయమై వెంటనే పరిష్కారం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు.