
రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చిక్కుల్లో పడ్డారు. న్యాయవ్యవస్థ పనితీరుపై వివాదాస్పద వ్యాఖ్య చేసిన సీఎం గెహ్లాట్ కు ఆ రాష్ట్ర హైకోర్టుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ హైకోర్టులోని డివిజన్ బెంచ్ శనివారం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై సుమోటో క్రిమినల్ ధిక్కార చర్యలను కోరుతూ దాఖలైన పిల్‌పై షోకాజ్ నోటీసు జారీ చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతిని సూచిస్తూ.. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యపై స్థానిక న్యాయవాది శివచరణ్ గుప్తా గురువారం పిల్ దాఖలు చేశారు. దీనిపై శనివారం జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అశుతోష్ కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని గెహ్లాట్‌కు నోటీసులు జారీ చేసింది.
బుధవారం జైపూర్‌లో విలేకరులతో మాట్లాడిన గెహ్లాట్.. ఈరోజు న్యాయవ్యవస్థలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని, కొందరు న్యాయవాదులు స్వయంగా తీర్పును లిఖితపూర్వకంగా తీసుకుని అదే తీర్పును వెలువరించారని విన్నాను. అయితే.. విమర్శలు ఎదుర్కొన్న తర్వాత, తాను చెప్పింది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, న్యాయవ్యవస్థను తాను ఎప్పుడూ గౌరవిస్తానని, నమ్ముతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు పలువురు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయవ్యవస్థను విశ్వసించాలని, ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని గెహ్లాట్ అన్నారు. గెహ్లాట్ వాంగ్మూలంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆరోపణలపై దర్యాప్తు చేయాలని మాజీ న్యాయమూర్తులు డిమాండ్ చేశారు. తరుణంలో రాజస్థాన్‌లోని న్యాయవాదులు శుక్రవారం న్యాయ విధులను బహిష్కరించారు.