యూపీలో హై అలర్ట్...విషజ్వరాలకు 84 మంది బలి

By Nagaraju TFirst Published Sep 21, 2018, 2:54 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌ ను విషజ్వరాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలు విషజ్వరాల బారినపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇప్పటి వరకు జ్వరాల ధాటికి 6 జిల్లాలో 84 మంది మృత్యువాత పడ్డారు. 

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ను విషజ్వరాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలు విషజ్వరాల బారినపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇప్పటి వరకు జ్వరాల ధాటికి 6 జిల్లాలో 84 మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా బరేలి జిల్లాలో అత్యధికంగా 24 మంది మృతి చెందగా, బుదౌన్ జిల్లాలో 23 మంది మరణించారు. మిగిలిన నాలుగు జిల్లాల్లో 37 మంది చనిపోయారు. 

రాష్ట్రంలో ఒక్కసారిగా విషజ్వరాల ప్రభావానికి 84 మంది మృతి చెందడంతో యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్ రాష్ట్రంలో హై అలర్ట్‌ ప్రకటించింది. ప్రజలను అప్రమత్తం చేసింది. ఎవరికైనా మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రిలో చేరాలని సూచించింది.  

ఉత్తరప్రదేశ్ లో ప్రజలను కబలిస్తున్న వ్యాధి గురించి పూర్తిగా తెలియడం లేదని యూపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. వ్యాధి బారిన పడిన వారిలో మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌ ఫివర్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ వ్యాధి రాజధానికి దగ్గరలోని జిల్లాలైన బరేలీ, బుదౌన్‌, హరోయి, సీతాపూర్‌, బహ్రైచ్‌, షాజహాన్‌పూర్‌ జిల్లాలో వ్యాపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 

విషజ్వరాలు ఇలాగే కొనసాగితే రాజధాని కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. అందువల్ల వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్ని ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే రోగులకు అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేస్తున్నామని...గ్రామాల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్ కూడా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.  

ఎవరైనా వ్యాధికి గురైతే వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నానని తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 

click me!