
బెంగళూరు: కర్ణాటక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప గురువారం కీలక ప్రకటన చేశారు. స్కూల్ పాఠ్య ప్రణాళికలో నుంచి హెడ్గేవర్, సావర్కర్‌ల పాఠాలు తొలగిస్తున్నట్టు వెల్లడించారు. అయితే, మారిన పాఠ్యప్రణాళికకు అనుగుణంగా ఇప్పటికిప్పుడు కొత్త పుస్తకాలు ముద్రించడం సాధ్యం కాదని మంత్రి తెలిపారు. అయితే, అన్ని పాఠశాలలకు సప్లిమెంటరీ పుస్తకాలను పంపిణీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు వివరించారు.
మంత్రి మధు బంగారప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘కేబీ హెడ్గేవర్ పై ఉన్న సిలబస్‌ను తొలగిస్తున్నాం. గతేడాది బీజేపీ ప్రభుత్వం చేసిన మార్పులు చేసింది. తాము అంతకు ముందటి సిలబస్‌నే మళ్లీ పునరుద్ధరిస్తున్నాం’ అని వివరించారు.
జాతీయ విద్యా విధానంలో భాగంగా చేసిన సిఫారసు లను తొలగించాలని, పాఠ్య పుస్తకాలను సమీక్షించాలని కమిటీ సభ్యులు మంత్రికి ఈ నెల లోనే ఓ మెమోరాండం సమర్పించారు. పాఠ్య పుస్తకాల సమగ్ర పరిశీలన ఇప్పుడు సాధ్యం కాదని, ఆ పుస్తకాలను ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేశారని మంత్రి వివరించారు. అయితే, సిలబస్‌లో మార్పులను గురించి బుక్ లెట్ ద్వరా ఉపాధ్యాయులకు వివరిస్తామని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోల్ మ్యానిఫెస్టో లో స్కూల్ పాఠ్య పుస్తకాల్లో మార్పులను తొలగిస్తామని హామీ ఇచ్చింది. జాతీయ విద్యా విధానాన్ని కూడా పక్కన పెడతామని పేర్కొంది.