ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. ఆలస్యంగా విమానాల రాకపోకలు..

By Sumanth KanukulaFirst Published May 27, 2023, 10:26 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. అయితే గత కొద్దిరోజులుగా వేడి గాలులతో సతమతవుతున్న ఢిల్లీ ప్రజలకు భారీ ఉపశమనం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌తో సహా సమీప ప్రాంతాలకు ఈ ఉదయం ఉరుములతో కూడిన తుఫాను సూచన జారీ చేయబడింది. మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది.

అయితే తాజాగా శనివారం ఉదయం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో.. ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం..  40-70 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన ఉరుములు/ధూళి తుఫాను కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 30 వరకు కూడా ఢిల్లీలో ఎండ తీవ్రత అంతగా ఉందని పేర్కొంది. 

శుక్రవారం రోజున ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా 34.5 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. ఇక, శనివారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 19.3 డిగ్రీలుగా  నమోదైంది. 

click me!