రానున్న మూడు రోజులు పలు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

By Mahesh RajamoniFirst Published Aug 25, 2022, 11:44 PM IST
Highlights

భారీ వ‌ర్షాలు: రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో భారత సైన్యం, ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయి. గత రెండు రోజుల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న 240 మందిని రక్షించామని, 120 మందికి పైగా ప్రాథమిక చికిత్స అందించామని ఆర్మీ అధికారి తెలిపారు. ధోల్‌పూర్‌లో చంబల్ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడంతో రాజస్థాన్‌లోని వరద ప్రభావిత 80 గ్రామాలలో సైన్యం సహాయక చర్య‌లు చేప‌ట్టింది. 
 

భారీ వ‌ర్షాలు-ఐఎంబీ హెచ్చ‌రిక‌లు: రానున్న రెండు మూడు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. భారీ వర్షాల మధ్య వరదలు సంభ‌వించ‌డంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో అనేక రాష్ట్రాలు అతలాకుతలమవుతున్న తరుణంలో ఐఎండీ ఈ హెచ్చ‌రిక‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. 

మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ ల‌లో.. 

ఆగష్టు 28న విదర్భ ప్రాంతంలో విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆగస్టు 25  నుంచి 28 తేదీల్లో కూడా అదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

పశ్చిమ బెంగాల్-సిక్కింల‌లో.. 

ఆగస్టు 27న ఒడిశా, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆగస్టు 27-29 వరకు ఒంటరిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏజెన్సీ అంచనా వేసింది. ప‌లు చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. 

ఉత్తరప్రదేశ్-బీహార్ ల‌లో.. 

ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఆగస్టు 27-28 తేదీలలో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని ఐంఎడీ తెలిపింది. ఆగస్టు 27-29 నుండి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాబోయే ఐదు రోజుల పాటు ఉత్తరాఖండ్‌కు ఐఎండీ  ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. అలాగే, ఆగస్టు 25న జమ్మూకశ్మీర్‌, ఆగస్టు 28న హిమాచల్‌ప్రదేశ్‌కు కూడా హెచ్చరికలు జారీ చేశారు.

ఈశాన్య భార‌తం..

నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర వంటి కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఆగస్టు 27-29 వరకు ఒక మోస్తరు వర్షపాతాన్ని అనుభవించవచ్చని ఐఎండీ అంచ‌నా వేసింది. అయితే, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలలో ఆగస్టు 25-29 నుండి ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేయబడింది. అయితే ఆగస్టు 27న ఈ రాష్ట్రాల్లో చాలా భారీ వర్షాలు కురుస్తాయి.

దక్షిణాది రాష్ట్రాలు

దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో ఆగస్టు 26న, తెలంగాణలో ఆగస్టు 27-28న వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలో ఆగస్టు 26-28 తేదీల్లో, తమిళనాడులో వచ్చే 5 రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచ‌నా వేసింది.

వరద పరిస్థితిపై మ‌ధ్య‌ప్ర‌దేవ్ సీఎం ఏమ‌న్నారంటే.. 

“భింద్, మోరెనా జిల్లాల్లో చంబల్ నదిలో నీటిమట్టం ఇంకా పెరుగుతున్నప్పటికీ వరద పరిస్థితి మెరుగుపడుతోంది. జిల్లా యంత్రాంగం, SDRF, NDRF అప్రమత్తంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన మూడు హెలికాప్టర్లను మోహరించారు” అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. “మధ్యప్రదేశ్‌లోని దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడం మా ప్రాధాన్యత. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు దిగాయి. ఇంత భారీ విపత్తు జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు'' అని తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన టర్ఫ్ లైన్, సర్క్యులేషన్ కారణంగా రాబోయే 2-3 రోజులలో రాష్ట్ర తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని IMD శాస్త్రవేత్త SN సాహు హెచ్చరించారు. కాగా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శాంతి ధరివాల్, ఎమ్మెల్యే పిపాల్డా రాంనారాయణ్ మీనా, సంగోడ్ భరత్ సింగ్ కుందన్‌పూర్ ఎమ్మెల్యేలతో కలిసి కోట, బుండి జిల్లాలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు.
 

click me!