దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, ఏపీలో గోడకూలి ఇద్దరు మృతి...

By SumaBala Bukka  |  First Published Jul 9, 2022, 12:00 PM IST

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 


ఢిల్లీ : దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్లో నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలకంగా మారినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా- కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలియజేసింది. మరోవైపు రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందని తెలిపింది. వీటన్నింటి ప్రభావంతో జమ్మూ కాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని పలు చెరువులు అలుగు పారుతున్నాయి. నవిపేట్ మండలం జనపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుంది.  గతంలో ఎన్నడూ ఇంత పెద్ద ఎత్తున అలుగు పారలేదని స్థానికులు చెబుతున్నారు. మండలంలోని లింగాపూర్ శివారులో వరద ఉధృతికి తుంగిని మాటు కాలువకు పలుచోట్ల గండి పడి నీరు పొలాల్లోకి  చేరి  సుమారు 100 ఎకరాల పంట నీట మునిగింది.

Latest Videos

గోడకూలి ఇద్దరు మృత్యువాత.. 
విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పెంకుటిల్లు గోడకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పెంకుటిల్లు గోడ కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఐదుగురు నిద్రిస్తుండగా వారిలో అడ్డాల లక్ష్మి(47), అశోక్ కుమార్ రాజు (5)అక్కడికక్కడే మృతి చెందారు.  శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్థుల సహాయంతో వెలికితీశారు. 

భద్రాద్రిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మణుగూరు ఏరియా బొగ్గు గనుల్లో వరద నీరు భారీగా చేరింది.  భారీ వర్షాలతో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 17 భారీ మోటార్ల సహాయంతో వర్షపు నీటిని  అధికారులు బయటకు పంపిస్తున్నారు. మరోవైపు నిల్వ ఉన్న బొగ్గును రవాణా చేస్తున్నారు.  మంచిర్యాల జిల్లాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపును  నిలిపివేశారు.

ఇబ్బందుల్లో లంక గ్రామాలు,  ప్రజలు…
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తుండడంతో లంక గ్రామాల ప్రజలకు మరోసారి అవస్థలు ప్రారంభమయ్యాయి. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ రోజు 1,20,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు.  బ్యారేజ్ కి దిగువ ఉన్న వైనితేయ గౌతమి గోదావరి నదిపాయలలోకి  వరద నీరు స్వల్పంగా చేరింది. కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం  బూరుగు లంక  రేవు వద్ద  వశిష్ట గోదావరి అనుబంధ పాయలకి వరద నీరు చేరడంతో ఇక్కడ తాత్కాలిక రహదారి తెగిపోయింది.

ఈ కారణంగా అవతల ఉన్న అరిగెలవారిపేట, బూరుగు లంక, udumudi లంక, జీ పెదపూడి లంక గ్రామాల ప్రజలు నాటు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

click me!